Shirdi double murder : షిర్డీలో దారుణం! ఇద్దరు సాయిబాబా సంస్థాన్ ఉద్యోగుల హత్య..
Shirdi crime news : షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దారుణ హత్యకు గురయ్యారు. వారిని కత్తితో పొడిచి,పొడిచి హతమార్చారు. ఈ నేరానికి సంబంధించి ఒక అనుమానితుడిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్ర షిర్డీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! సాయిబాబా సంస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు! కత్తితో పలుమార్లు పొడిచి చంపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇది జరిగింది..!
షిర్డీలో సోమవారం ఈ ఘటన జరిగింది. షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కి చెందిన ముగ్గరిపో కర్దోబా నగర్ చౌక్, సకోరి శివ్ ఏరియా, ఎయిర్పోర్ట్ రోడ్లలో దాడులు జరిగాయి. ఈ మూడు నేరాలకు పాల్పడింది ఒకరే అని, దొపిడీ కోసం వారు ప్రయత్నించినట్టు అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మృతులను కర్దోబా నగర్‌కు చెందిన సుభాష్ సాహెబ్ రావ్ ఘోడే (43), సకోరి శివ్‌కు చెందిన నితిన్ కృష్ణ షెజుల్ (45)గా గుర్తించారు. వీరిద్దరు సాయిబాబా సంస్థాన్ ఉద్యోగులు. శ్రీకృష్ణ నగర్‌కు చెందిన కృష్ణ దేహర్కర్ అనే వ్యక్తి ప్రవరనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ఆలయ శాఖలో ఘోడే సహాయకుడిగా పనిచేస్తుండగా, షేజుల్ సెక్యూరిటీ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. మరోవైపు మెడ, ఇతర భాగాలకు తీవ్ర గాయాలైన దేహర్కర్.. ఫ్యాబ్రికేషన్ వ్యాపారం చేస్తున్నాడు.
ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయా ప్రాంతాల్లోని స్థానిక సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. బాధితులపై కత్తులతో దాడి చేసి పరారైన దృశ్యాలు కనిపించాయి.
1-1.5 కిలోమీటర్ల పరిధిలో, వేర్వేరు ప్రాంతాల్లో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దాడులకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అహల్యనగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ ఓలా తెలిపారు.
ఈ ఘటనలతో సంబంధం ఉన్న ఒక అనుమానితుడిని పట్టుకున్నామని, ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
షిర్డీ సబ్ డివిజనల్ పోలీసు అధికారి శిరీష్ వామానే మాట్లాడుతూ.. “తెల్లవారుజామున రోడ్లు నిర్మానుష్యంగా ఉన్న సమయంలో నిందితులు, బాధితులను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాధితులు ప్రతిఘటించడంతో వారిని కత్తితో పొడిచారు,” అని తెలిపారు.
మృతుడు సుభాష్ ఘోడే సోదరుడు ప్రకాశ్ మాట్లాడుతూ.. “నా సోదరుడు ప్రాణాలను కాపాడటానికి పరిగెత్తాను. కానీ దుండగులు అతన్ని వెంబడించి చంపారు," అని చెప్పాడు.
ఈ కేసులో రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, మూడో ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
సుభాష్ ఘోడే హత్య కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103, 126, 309, 311, 312, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 4(25) కింద షిర్డీ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షేజుల్ హత్య కేసులో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 103, 126, 309, 311, 312, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 4(25) కింద రహతా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, షిర్డీ మాజీ పార్లమెంటు సభ్యుడు సుజయ్ విఖే పాటిల్ మాట్లాడుతూ, “బాధితులు కత్తిపోట్లకు గురైనట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో నిష్పాక్షిక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి,” అని తేల్చిచెప్పారు.
మరణించిన ఇద్దరు ఉద్యోగులకు బీమా చేశామని, వారి కుటుంబాలకు పరిహారం అందుతుందని.. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) గోరక్ష గడిల్కర్ తెలిపారు.
సంబంధిత కథనం