Eknath Shinde | ఈ సీఎం ఒకప్పుడు ఆటో డ్రైవర్
Eknath shinde : ఏక్‌నాథ్ షిండేగా చిరపరిచితమైన మహారాష్ట్ర కొత్త సీఎం పూర్తి పేరు.. ఏక్‌నాథ్ శంభాజీ షిండే. `షిండే భాయి` గా అనుచరులు ప్రేమగా పిలుస్తుంటారు. కుటుంబ పోషణ కోసం మొదట్లో ఆటో నడిపిన షిండే.. ఒక రాష్ట్రాన్నే నడిపే స్థాయికి ఎదగడం భారత ప్రజాస్వామ్యం గొప్పదనం. షిండే జీవన ప్రస్థానం క్లుప్తంగా..
బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర 20వ సీఎంగా జూన్ 30న శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శంభాజీ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. శివసేనలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు ఎదిగిన షిండే రాజకీయ ప్రస్థానంలో ఎన్నో వివాదాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విషాధాలు ఉన్నాయి. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా మారుస్తూ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మర్నాడే ఏక్‌నాథ్ శంభాజీ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయడం విశేషం.
Eknath shinde : 1964లో జననం
ఏక్‌నాథ్ శంభాజీ షిండే 1964 ఫిబ్రవరి 9న మహారాష్ట్రలోని సతారా పట్టణంలో సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆ తరువాత విద్యాభ్యాసం కోసం థానె కు షిఫ్ట్ అయ్యారు. మంగళ హై స్కూల్‌లో పాఠశాల విద్య, స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. కానీ ఇంటర్మీడియెట్ మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడడంతో, వారికి సాయంగా ఉండడం కోసం ఆటో డ్రైవర్‌గా మారారు. కొన్నాళ్లు బీరు కంపెనీలో కూడా పనిచేశారు.
Eknath shinde : ఆనంద్ దిఘే అనుచరుడిగా..
అదే సమయంలో థానె లోకల్ లీడర్, ఫైర్ బ్రాండ్ ఆనంద్ దిఘేతో పరిచయం ఏర్పడింది. దిఘేకు అనుచరుడిగా, కాలక్రమేణా ప్రధాన అనుచరుడిగా మారాడు. శివసేనలో పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు. ఆనంద్ దిఘే సూచనల మేరకు రాజకీయంగా ఎదగడం ప్రారంభించాడు. బాలాసాహెబ్ బాల్ ఠాక్రేను దేవుడిగా ఆరాధించే షిండే.. శివసేన చేపట్టిన చాలా నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. మహారాష్ట్ర- కర్నాటక సరిహద్దు వివాదం సందర్భంగా 40 రోజులు జైళ్లో కూడా ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆనంద్ దిఘే ఆ తరువాత ఆసుపత్రిలో మరణించాడు. ఆ సమయంలో ఆ హాస్పిటల్‌పై తన అనుచరులతో కలిసి ఏక్‌నాథ్ షిండే దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనపై కేసు కూడా నమోదైంది.
Eknath shinde : ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్
శివసేనలో షిండేకు ఉద్ధవ్ ఠాక్రేతో మొదట్లో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఉద్ధవ్ కోటరీలో ఒకరుగా పేరుగాంచాడు. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేరారు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేతో విభేదాలతో పాటు, సంజయ్ రౌత్ కు పార్టీలో పెరుగుతున్న ప్రాముఖ్యతను షిండే తట్టుకోలేకపోయాడని పార్టీ వర్గాల సమాచారం. దాంతో, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ప్రభుత్వంపై అప్పటికే శివసేన ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించిన షిండే.. బీజేపీతో సంప్రదింపులు ప్రారంభించారు.
దేవేంద్రతో సాన్నిహిత్యం
బీజేపీలోని దేవేంద్ర ఫడణవీస్ తో కూడా షిండేకు సాన్నిహిత్యం ఉంది. శివసేన ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిపై దేవేంద్ర ఫడణవీస్‌తో చర్చించి, ఉద్ధవ్‌పై తిరుగుబాటుకు షిండే తెరతీశారు. ప్రస్తుతం షిండే ముంబై శివార్లలోని `కోప్రి-పచ్‌పకిడి` ఎమ్మెల్యేగా ఉన్నారు.
Eknath shinde : కార్పొరేటర్‌గా..
మహారాష్ట్ర అసెంబ్లీకి 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎన్నికైన షిండే.. మొదట 1997లో శివసేన నుంచి థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. షిండేను శివసేన చీఫ్ బాలాసాహెబ్ బాల్‌ఠాక్రే చాలా ప్రోత్సహించారు. ప్రస్తుతం షిండే కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ షిండే కళ్యాణ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.
ఇద్దరు కుమారుల మృతి
వ్యక్తిగత జీవితంలో షిండే చవిచూసిన పెద్ద విషాధం తన కుమారుల మరణం. 2000 సంవత్సరంలో 7, 11 ఏళ్ల వయస్సున్న ఆయన ఇద్దరు కుమారులు స్వగ్రామం లోని చెరువులో బోటింగ్‌కు వెళ్లి, బోట్ తిరగబడడంతో నీళ్లలో మునిగి, చనిపోయారు.