ప్రముఖ నటి- మోడల్, హిందీ బిగ్ బాస్ ఫేమ్ షెఫాలీ జరివాలా కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి 42ఏళ్ల షెఫాలీని ఆమె భర్త పరాగ్ త్యాగీ ముంబైలోని బెల్లెవూ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్ల షెఫాలీ జరివాలా మృతిచెందారు.
ప్రముఖ జర్నలిస్ట్ విక్కీ లాల్వాని సోషల్ మీడియా వేదికగా షెఫాలీ మరణ వార్తపై తొలి పోస్ట్ చేశారు.
“షెఫాలీ జరివాలా, ది కాంటా లగా గర్ల్ ఇక మన మధ్యలో లేరు. ఆమె మరణానికి ఇంకా కారణం తెలియదు. కానీ ఆమెను ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మరణించారు. షెఫాలీ భర్త పరాగ్ త్యాగీ, మరో ముగ్గురు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వార్తను ఆసుపత్రిలోని రిసెప్షన్ స్టాఫ్ ధ్రువీకరించారు. “ఇక్కడికి తీసుకొచ్చే లోపే షెఫాలీ జరివాలా ప్రాణాలు కోల్పోయారు,” అని వారు చెప్పారు,” అని విక్కీ పోస్ట్ చేశారు.
షెఫాలీ జరివాలా గుండెపోటుతో మరణించారని ఆ తర్వాత వెలువడింది.
కంప్యూటర్ ఇంజినీర్ అవ్వాలనుకున్న షెఫాలీ జరివాలా.. 2002లో “కాంటా లగా” అనే మ్యూజిక్ వీడియోలో నటించి ఫేమస్ అయ్యారు. అప్పుడామే వయస్సు 20ఏళ్లు. 1972లోని ప్రముఖ పాటకు ఇది రీమిక్స్. అప్పటి నుంచి షెఫాలీ అనేక మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించారు. 2020లో సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్‌లో కూడా ఆమె కనిపించారు.
మ్యూజీషియన్ హర్మీత్ సింగ్‌తో 2009లో విడాకుల అనంతరం షెఫాలీ జరివాలా.. పరాగ్ త్యాగీని కలిశారు. వారిద్దరు నాలుగేళ్లు డేటింగ్ చేసి 2014లో పెళ్లి చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన పరాగ్ త్యాగీ టీవీ, సినిమాల్లో పనిచేశారు. జీటీ పవిత్ర రిష్త (2009-2014) సీరియల్‌తో వినోద కరంజ్కర్గా పరాగ్ త్యాగీ మంచి గుర్తింపు పొందారు. 2016లో వచ్చిన బ్రహ్మరాక్షస్లో కూడా నటించారు.
షెఫాలీ జరివాలా- పరాగ్ త్యాగీ దంపతులు అనేక రియాలిటీ షోలలో కలిసి పాల్గొన్నారు.
షెఫాలీ జరివాలా మరణం తర్వాత, ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.
“ప్రపంచంలో ఒక్కరంటే ఒక్కరే కాంటా లగా గర్ల్ ఉండగలరు. అది నేనే! అది నాకు చాలా ఇష్టం. నేను చనిపోయేంత వరకు అందరు నన్ను “కాంటా లగా గర్ల్” అని గుర్తుపెట్టుకోవాలి,” అని షెఫాలీ అన్నారు.
షెఫాలీ మరణంపై పలువురు ప్రముఖులు స్పందించారు.
“షాక్ అయ్యాను. బాధగా ఉంది. గుండె బరువెక్కింది. నా ప్రియమైన స్నేహితురాలు షెఫాలీ జరివాలా మనల్ని వదిలేసి వెళ్లిపోయింది. ఈ వార్తను ఇంకా నమ్మలేకపోతున్నాను. నీ నవ్వు, స్ఫూర్తికి ఎప్పటికీ గుర్తుండిపోతావు. ఓం శాంతి,” అని ప్రముఖ సింగర్ మికా సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సంబంధిత కథనం