జైలు నుంచి విడుదల అయిన ఇంద్రాణి ముఖర్జీ
షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు ఆమెకు గురువారం బెయిల్ మంజూరు చేసింది. సొంత కూతురు షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలు.
సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. 2015 ఆగస్ట్ నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. `నా ఈ పరిస్థితికి కారణమైన, నన్ను బాధపెట్టిన అందరినీ క్షమిస్తున్నా. జైలు జీవితం నాకు చాలా నేర్పించింది` అని ఆమె ఉద్వేగంగా పేర్కొన్నారు. అంతకుముందు, ఆమె లాయర్ సానా రాయీస్ షేక్ జైలులో ఫార్మాలిటీస్ ను పూర్తి చేశారు. ఇకపై షీనాబోరా హత్య కేసుకు సంబంధించిన ప్రతీ విచారణకు ఇంద్రాణి ముఖర్జీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఆరున్నరేళ్లుగా జైలు జీవితం
విచారణ ఖైదీగా గత ఆరున్నరేళ్లుగా జైలు జీవితం గడపడాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగేశ్వర్ రావు, జస్టిస్ బీఆర్ గవాయి. జస్టిస్ బోపన్నల ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా విచారణను సాగదీస్తున్న ప్రాసక్యూషన్‌పై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. గత సంవత్సరం నవంబర్‌లో ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. ఇంద్రాణి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. సొంత కూతురినే హతమార్చిన దారుణమైన నేరం ఇంద్రాణి చేసిందని, ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరింది. 2015లో ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. వేరే కేసు విచారణ సమయంలో షీనా బోరా హత్య విషయాన్ని ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ పోలీసులకు వెల్లడించాడు. తానే ఈ హత్య చేశానని, ఇందులో ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త సంజీవ్ ఖన్నా హస్తం కూడా ఉందని వెల్లడించాడు.
టాపిక్