Earthquake : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. 53 మంది మృతి, పలు భవనాలు నేలమట్టం
Nepal-Tibet Earthquake : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో వచ్చిన భూకంపం అల్లకల్లోలం సృష్టించింది. ఇప్పటికే టిబెట్‌లో 53 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. ఈ సరిహద్దుల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించడంతో చాలా మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విపత్తతో టిబెట్‌లో సుమారు 53 మంది ఇప్పటి వరకు మరణించినట్టుగా తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:05 గంటలకు భూ ప్రకంపనలు సంభవించినట్లు ప్రాంతీయ విపత్తు సహాయ ప్రధాన కార్యాలయం తెలిపింది. ఈ ప్రభావం టిబెట్ అటానమస్ రీజియన్‌లోని జిగాజ్ నగరంలోని డింగ్రీ కౌంటీపై పడింది.
భూకంపం ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయని, అనేక భవనాలు కూలిపోయాయని వార్తలు వస్తున్నాయి. చైనా ప్రభుత్వ బ్రాడ్ కాస్టర్ సీసీటీవీ విడుదల చేసిన కొన్ని వీడియోల్లో నేలమట్టమైన ఇళ్లు కనిపించాయి. పలు ఇళ్ల గోడలు పగిలిపోయాయి. భూకంపం తర్వాత శిథిలాల వద్ద సహాయక సిబ్బంది చేరారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు ఫుటేజీలో కనిపించాయి. కారిడార్ల గుండా ప్రజలు పరిగెత్తుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
భూకంపం తర్వాత చైనా భూకంప అడ్మినిస్ట్రేషన్ లెవల్-2 ఎమర్జెన్సీ సర్వీస్ రెస్పాన్స్ ప్రారంభించింది. విపత్తు సహాయక చర్యల్లో సహాయపడటానికి టాస్క్ ఫోర్స్ ను సంఘటనా స్థలానికి పంపారు. కాటన్ టెంట్లు, కాటన్ కోటులు, దుప్పట్లు, మడతపెట్టే పడకలతో సహా సుమారు 22,000 విపత్తు సహాయ సామగ్రిని పంపించారు. అలాగే ఎత్తైన ప్రాంతాలు, శీతల ప్రాంతాలకు ప్రత్యేక సహాయ సామగ్రిని పంపిస్తున్నారు. 1500 మందికి పైగా స్థానిక అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు.
20 కిలోమీటర్ల పరిధిలో సుమారు 6,900 మంది జనాభా ఉన్న డింగ్రీ కౌంటీలోని సోగో టౌన్‌షిప్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతం చుట్టూ 27 గ్రామాలు ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం డింగెరీ కౌంటీలో 61,000 మందికి పైగా జనాభా ఉంది. మరోవైపు టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.
ఈ ప్రభావం భారత్‌లో కూడా కనిపించింది. ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. దిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. బీహార్‌లో ఫ్యాన్లు, సీలింగ్‌కు వేలాడుతున్న బల్బులు ఊగుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.