Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్- 14 మంది మావోయిస్టులు హతం!
Chhattisgarh encounter live : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మావోయిస్టుల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో కాల్పుల మోత మోగింది! పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు కనీసం 14 మంది మావోయిస్టులు మరణించారు. కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు కూడా ఈ ఎన్కౌంటర్లో హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

14మంది మావోయిస్టులు హతం..!
ఛత్తీస్‌గఢ్ ఒడిశా సరిహద్దులోని మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో సోమవారం అర్థరాత్రి, మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఆపరేషన్‌లో భాగంగా ఒక కోబ్రా జవాను గాయపడినట్లు తెలిపారు.
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి 30ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. ఆయనపై కోటి రుపాయల రివార్డు ఉంది. ఆయన భార్య అరుణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఛత్తీస్‌గఢ్‌కి చెందిన కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ)లకు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్- ఒడిశాకు చెందిన పోలీసు అధికారులు ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఒడిశాలోని నువాపాడా జిల్లా సరిహద్దుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జనవరి 19 రాత్రి ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులను మట్టుబెట్టామని, ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రి, ఐఈడీలు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
మరణించిన మావోయిస్టుల మృతదేహాల కింద ఐఈడీలు ఉండి ఉండొచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.
మావోయిస్టులపై భారీ ఆపరేషన్..!
జనవరి 6న ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో నక్సలైట్లు జరిపిన ఐఈడీ దాడిలో ఎనిమిది మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు, ఒక డ్రైవర్ మరణించారు. ఈ నేపథ్యంలో 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘటించారు. అప్పటి నుంచి మావోయిస్టులపై భద్రదళాలు విరుచుకుపడుతున్నారు.
ఈ ఒక్క నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని వేరువేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 30కిపైగా మంది మావోయిస్టులు హతమయ్యారు. 12న బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. జనవరి 16న అదే బీజాపూర్‌లో జరిగిన మరో ఎన్కౌంటర్లో 12మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు.
ఇక గతేడాది భద్రతా దళాలతో వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్‌కౌంటర్స్‌లో 219మంది మావోయిస్టులు హతమయ్యారని డేటా చెబుతోంది.
సంబంధిత కథనం