Shooting in US Hospital: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం; ఈ సారి హాస్పిటల్ లో..
Shooting in US Hospital: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాంకర్డ్ లోని న్యూ హ్యాంప్ షైర్ ప్రభుత్వ హాస్పిటల్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల వల్ల మరణించిన వారి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
Shooting in US Hospital: న్యూ హాంప్‌షైర్ సైకియాట్రిక్ హాస్పిటల్‌లో శుక్రవారం చోటు చేసుకున్న కాల్పుల్లో బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉందని, కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయాడని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ సైకియాట్రీ హాస్పిటల్
మానసిక వ్యాధులకు చికిత్స అందించే ప్రభుత్వ న్యూ హ్యాంప్ షైర్ హాస్పిటల్ (New Hampshire Hospital) లో కాల్పులు జరిగాయి. ఒక దుండగుడు ఆస్పత్రిలోని పేషెంట్లు, సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ ఆసుపత్రిలో కేవలం 185 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఆసుపత్రి దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆ దుండగుడి కాల్పుల్లో బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉందని వెల్లడించిన అధికారులు, మరణించిన వారి వివరాలు కానీ, క్షతగాత్రుల వివరాలను కానీ వెల్లడించలేదు. కాల్పులు జరిపిన దుండగుడు కూడా భద్రతాబలగాల కాల్పుల్లో మరణించాడని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సాధారణ పరిస్థితి నెలకొన్నదని వివరించారు.
బాధితుల వివరాలు..
ఈ కాల్పుల ఘటనలో ఎక్కువ సంఖ్యలో బాధితులు ఉన్నారని వెల్లడించిన స్థానిక పోలీసులు.. పూర్తి వివరాలను వెల్లడించలేదు. న్యూహాంప్ షైర్ ఆసుపత్రి మానసిక వ్యాధులతో బాధపడుతున్న పెద్ద వారి చికిత్స కోసం ఉద్దేశించిన రెసిడెన్షియల్ ఆసుపత్రి. అయితే, ఈ కాల్పుల ఘటనలో పేషెంట్లెవరూ చనిపోలేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.