MP Crime news: స్కాలర్ షిప్ పేరుతో ఏడుగురు విద్యార్థినులను ప్రలోభపెట్టి అత్యాచారం
కాలేజీ ప్రిన్సిపాల్ నని చెప్పి, స్కాలర్ షిప్ ఇప్పిస్తామని ఆశపెట్టి ఏడుగురు గిరిజన యువతులపై అత్యాచారం చేసిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. గొంతు మార్చి వినిపించే యాప్ ద్వారా మహిళా ప్రిన్సిపాల్ నని ప్రధాన నిందితుడు ఆ యువతులకు కాల్ చేశాడు.
మొబైల్ అప్లికేషన్ ద్వారా తన వాయిస్ ను మహిళ వాయిస్ గా మార్చుకుని ఏడుగురు యువతులను ప్రలోభాలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల్లో ఒకరు మే 20న మాఝౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితులు షెడ్యూల్డ్ తెగల సామాజిక వర్గానికి చెందిన వారు. ఫోన్ లో మహిళ గొంతుతో తాను కాలేజీ ప్రిన్సిపాల్ నని, ఎస్టీ స్కాలర్ షిప్స్ ఇప్పిస్తానని ప్రధాన నిందితుడు బ్రజేష్ ప్రజాపతి ఆ యువతులకు ఆశచూపి, వారిపై అత్యాచారం చేశాడు.
పోలీసుల అదుపులో నిందితులు
ప్రధాన నిందితుడు బ్రజేష్ ప్రజాపతితో పాటు అతడికి సహకరించిన ముగ్గురు నిందితులు రాహుల్ ప్రజాపతి (24), లవ్ కుష్ ప్రజాపతి (23), సందీప్ ప్రజాపతి (21)లను అత్యాచారం, అక్రమ నిర్బంధం, స్వచ్చందంగా గాయపరచడం వంటి అభియోగాల కింద పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రేవా రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ సికార్వార్ తెలిపారు.
నేరం చేసిందిలా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీ వాట్సప్ గ్రూపుల ద్వారా షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఆ యువతుల కాంటాక్ట్ నంబర్లను బ్రజేష్ ప్రజాపతి సంపాదించాడు. ఆ తర్వాత పురుషుల గొంతును మహిళల గొంతుగా మార్చే యాప్ ను ఉపయోగించి, తాను కాలేజీ మహిళా ప్రిన్సిపాల్ నని వారికి ఫోన్ చేశాడు. ఎస్టీ స్కాలర్ షిప్స్ ఇప్పిస్తానని చెప్పి, తన వద్దకు రప్పించుకుని వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించేవాడు.
మ్యాజిక్ వాయిస్ అనే మొబైల్ యాప్ ద్వారా
ప్రధాన నిందితుడు బ్రజేష్ ప్రజాపతి మ్యాజిక్ వాయిస్ అనే మొబైల్ యాప్ ద్వారా తన వాయిస్ ను మార్చి విద్యార్థినులకు ఫోన్ చేసి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రంజనా మేడమ్ గా పరిచయం చేసుకునేవాడని ఐజీ తెలిపారు. ఉపకార వేతనాలు విడుదల చేయడానికి వెంటనే వారి సంతకాలు అవసరమని బ్రజేష్ వారికి చెప్పేవాడు. ఆ సంతకాల కోసం తన కొడుకు వస్తాడని, అతడితో తను చెప్పిన ప్రదేశానికి రావాలని చెప్పేవాడు. అలా వచ్చిన యువతులపై అత్యాచారం చేసేవాడు. వారి మొబైల్ ఫోన్లు లాక్కుని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారిని బెదిరించేవాడు.
పోలీసు కేసు
బాధితురాళ్లలో ఒక యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు బ్రజేష్ తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, వీలైనంత ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోవాలన్నది అతడి లక్ష్యమని చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు బాధితులు మాత్రమే నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందుకు వచ్చారని వివరించారు. నిందితుల వద్ద ఉన్న 16 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరింత మంది నిందితులు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఐజీ తెలిపారు.
సీఎం స్పందన
ఈ దారుణంపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సిద్ధిలో షెడ్యూల్డ్ గిరిజన విద్యార్థినులపై జరిగిన ఈ దారుణ ఘటనపై సిట్ దర్యాప్తు చేయనుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ విచారణ జరిపి నివేదిక సమర్పిస్తుంది.