టెల్ అవీవ్ లోని కొన్ని ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ శుక్రవారం రాత్రి భారీ పరీక్షను ఎదుర్కొంది. ఇరాన్ వైపు నుంచి వచ్చిన చాలా క్షిపణులను విజయవంతంగా నిరోధించామని, అయితే కొన్ని మాత్రం తమ రక్షణ వ్యవస్థను చేధించి టెల్ అవీవ్ లోని కొన్ని భవనాలపై డ్డాయని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఇది ఇజ్రాయెల్ కు పరిమిత నష్టాన్ని కలిగించింది. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్ వ్యవస్థ స్వల్పశ్రేణి రాకెట్లను కూల్చడంలో ప్రత్యేకత కలిగి ఉంది. గత దశాబ్దం ప్రారంభంలో యాక్టివేట్ చేసినప్పటి నుండి ఇది వేలాది రాకెట్లను అడ్డుకుంది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ 90 శాతానికి పైగా సక్సెస్ రేట్ కలిగి ఉందని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.
మరోవైపు, ఇజ్రాయెల్ ఇరాన్ పై బీకర దాడులను కొనసాగిస్తుంది. ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా ఖొమేనీ నివాసం సమీపంలో కూడా బాంబులు పడ్డాయి. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో శుక్రవారం 78 మంది మరణించగా, 320 మందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి తెలిపారు. ఈ దాడులు జనరల్స్, సైంటిస్టులను లక్ష్యంగా చేసుకున్నాయని, మృతుల్లో అత్యధికులు పౌరులేనని రాయబారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలిపారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇజ్రాయెల్, ఇరాన్ లు పరస్పరం దాడులను ఆపుకోవాలని కోరారు. ‘‘ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. టెల్ అవీవ్ లో ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతలను ఆపే సమయం వచ్చింది. శాంతి, దౌత్యం నెలకొనాలి’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ శనివారం ఎక్స్ లో రాశారు.