Sensex Sinks | ‘బేర్‌’మన్న స్టాక్ మార్కెట్లు-sensex sinks 5 percent as global selloff extends on ukraine risk ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sensex Sinks | ‘బేర్‌’మన్న స్టాక్ మార్కెట్లు

Sensex Sinks | ‘బేర్‌’మన్న స్టాక్ మార్కెట్లు

HT Telugu Desk HT Telugu

రష్యా దళాలు ఉక్రెయిన్ అంతటా దాడి చేయడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లలాగే కుదేలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత ఘోరమైన భద్రతా సంక్షోభాన్ని రేకెత్తించిన తాజా పరిస్థితి వల్ల మార్కెట్లు విలవిల్లాడాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం ముందు స్క్రీన్ చూస్తూ తలపట్టుకున్న మదుపుదారు (AP)

గురువారం భారతీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 5% వరకు క్షీణించింది. సెన్సెక్స్ 4.7% పడిపోయింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మార్చి 2020లో భారీగా కుప్పకూలిన మార్కెట్లు తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడితో మళ్లీ విలవిలలాడాయి. ఏడు రోజుల నష్టాలతో సుదీర్ఘమైన నష్టాలను చవిచూశాయి.

గురువారం ఫిబ్రవరి డెరివేటివ్‌ల గడువు ముగియడంతో తీవ్ర తగ్గుదల ఏర్పడింది. ఎన్ఎస్ఈ అస్థిరత సూచిక 30% పెరిగింది. రూపాయి 1.4% పడిపోయింది. 

ఉక్రెయిన్‌లో పాశ్చాత్య దేశాల సైనికులను నిర్వీర్యం చేస్తామని, ఈ దిశగా సైనిక చర్య ప్రారంభమైందని రష్యా అధ్యక్షుడు గురువారం ఉదయం ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు కాస్త కుదుటపడ్డట్టు అనిపించినప్పటికీ, సైనిక చర్య ఉక్రెయిన్ అంతటా విస్తరించనుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం మరింతగా భీతిల్లాయి. చమురు ధర పెరుగుతండడంతో గ్లోబల్ స్టాక్స్ పతనమయ్యాయి. ఆసియా స్టాక్ బెంచ్‌మార్క్ నవంబర్ 2020 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సెన్సెక్స్ క్షీణతకు అత్యధికంగా కారణమైంది. 5% పడిపోయింది. తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో 5.5% తగ్గుదల కనిపించింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 స్టాక్‌లు పడిపోయాయి.

ఇటీవలే స్టాక్ మార్కెట్లలో లిస్టయిన స్టార్ హెల్త్, పేటీఎం వంటి స్టాక్‌లు భారీగా నష్టపోయాయి. 

అత్యధికంగా నష్టపోయిన స్టాక్స్‌లో టాటా మోటార్స్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఇండస్ టవర్స్, వోడాఫోన్ ఇండియా, పీఎన్‌బీ,  యెస్ బ్యాంక్, రెయిన్ ఇండస్ట్రీస్, ఎన్బీసీసీ, ఆర్బీఎల్ బ్యాంక్, అమరరాజ బ్యాటరీస్, జీఎంఆర్ ఇన్ ఫ్రా, ఎల్ అంట్ టీ ఫైనాన్స్, బెల్, సెయిల్, ఇండిగో, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పది శాతం నష్టపోయాయి.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.