Supreme Court On Maha politics: మహారాష్ట్ర అంశాలపై విస్తృత ధర్మాసనం.. 8న నిర్ణయం-sc says it will decide whether to refer issues involved in maharashtra political crisis to 5 judge constitution bench ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sc Says It Will Decide Whether To Refer Issues Involved In Maharashtra Political Crisis To 5-judge Constitution Bench

Supreme Court On Maha politics: మహారాష్ట్ర అంశాలపై విస్తృత ధర్మాసనం.. 8న నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Aug 04, 2022 05:22 PM IST

Supreme Court On Maharashtra politics:మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి లేవనెత్తిన కొన్ని న్యాయపరమైన అంశాలను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలా వద్దా అనే దానిపై ఆగస్టు 8న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.

మహారాష్ట్ర సంక్షోభంలో ఎదురైన న్యాయపరమైన అంశాలపై రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా లేదా అన్న అంశంపై ఆగస్టు 8న తేల్చనున్న సుప్రీం కోర్టు
మహారాష్ట్ర సంక్షోభంలో ఎదురైన న్యాయపరమైన అంశాలపై రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా లేదా అన్న అంశంపై ఆగస్టు 8న తేల్చనున్న సుప్రీం కోర్టు (HT_PRINT)

'నిజమైన శివసేన' పార్టీగా గుర్తింపు, అలాగే పార్టీ ఎలక్షన్ సింబల్ విల్లు, బాణం గుర్తు కేటాయింపు కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే క్యాంపు దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శిబిరం షిండే క్యాంపు పిటిషన్‌పై నోటీసులకు ప్రతిస్పందనను దాఖలు చేయడానికి సమయం కోరితే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఠాక్రే క్యాంపు తమ అఫిడవిట్‌లను దాఖలు చేయడానికి అనుమతించాలని, ముందస్తు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

‘ఈ విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలా వద్దా అని మేం నిర్ణయిస్తాం. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం ఏక్‌నాథ్ షిండే అభ్యర్థనపై స్పందన తెలిపేందుకు గడువు 8వ తేదీ వరకు ఉంది. దీనిపై వారు మరింత సమయం కోరతారు. అందుకు ఈసీఐ అనుమతించాలి. మేం సోమవారంలోగా మా నిర్ణయం వెల్లడిస్తాం..’ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

'నిజమైన' శివసేనగా గుర్తింపు కోసం ఏక్‌నాథ్ షిండే గ్రూప్ వాదనపై భారత ఎన్నికల సంఘం ముందు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన శిబిరం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికల సంఘం ఈ విషయాన్ని నిర్ణయించజాలదని శివసేన ప్రధాన కార్యదర్శి సుభాష్ దేశాయ్ తన పిటిషన్‌లో విన్నవించారు.

'నిజమైన' శివసేనగా గుర్తింపు కోసం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం చేసిన అభ్యర్థనపై, పార్టీ ఎన్నికల చిహ్నం విల్లు- బాణం కోసం వారి దావాపై భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన విచారణను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

<p>మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండే</p>
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండే (HT_PRINT)

జూలై 22న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గానికి ఈసీఐ నోటీసు అందజేసింది. అందులో ఏక్నాథ్ షిండే, మరికొందరు వ్యక్తులు 'నిజమైన' శివసేనగా గుర్తించాలని కోరారని, ఎన్నికల గుర్తుపై హక్కును క్లెయిమ్ చేస్తున్నారని కమిషన్ పేర్కొంది. ఆగస్టు 8లోగా ఠాక్రే వర్గం స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం కోరింది.

తిరుగుబాటు ఎమ్మెల్యేలు శివసేన పార్టీని ఎప్పుడూ విడిచిపెట్టలేదని, పార్టీలో చీలిక లేదని షిండే బృందం నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు అనర్హులు అని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శిబిరం వాదించడంతో ఇది ‘పార్టీ వ్యతిరేకం కాదు.. పార్టీ అంతర్గత వివాదం’ అని షిండే గ్రూప్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అన్నారు.

‘నేను పార్టీలో అసమ్మతి సభ్యుడిని. నేను శివసేనలో భాగం. పార్టీలో ప్రజాస్వామ్యం ఉండాలి. రాజకీయ పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయని నేను చెబుతున్నాను’ అని షిండే గ్రూపునకు ప్రాతినిధ్యం వహిస్తూ సాల్వే అన్నారు.

పార్టీ సమావేశానికి షిండే బృందాన్ని పిలిచారని, వారు సూరత్‌కు వెళ్లి అక్కడి నుంచి గౌహతికి వెళ్లారని ఠాక్రే వర్గం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం వాదించారు. ‘వారు డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. వారు తమ విప్‌ను నియమించారు. వారి ప్రవర్తన ద్వారా షిండే వర్గం పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంది. వారు తమది ఒరిజినల్ పార్టీ అని చెప్పుకోలేరు. పదో షెడ్యూల్ దానిని అనుమతించదు’ అని సిబల్ విన్నవించారు.

‘మీది రాజకీయ పార్టీ అని మీరు చెప్పుకోలేరు. గౌహతిలో కూర్చున్న రాజకీయ పార్టీ అని మీరు అంటున్నారు. రాజకీయ పార్టీని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. మీరు గౌహతిలో కూర్చొని ప్రకటించలేరు’ అని ఆయన అన్నారు.

పదో షెడ్యూల్ కేసులో ఓ పార్టీ వచ్చి పార్టీ సభ్యత్వం ఇచ్చామని చెప్పడం ఈ కోర్టు చరిత్రలో చూడలేదని సిబల్ అన్నారు. అందుకే సభ్యత్వం వదులుకున్నారో లేదో తేల్చేందుకు ప్రవర్తన చూడాలని నివేదించారు.

విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరం

అంతకుముందు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ఉన్న కొన్ని అంశాల పరిశీలనకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

శివసేన సభ్యులపై జారీ చేసిన కొత్త అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను కూడా కోరింది.

శివసేనకు చెందిన ఇరువర్గాలు దాఖలు చేసిన వివిధ పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

ఏక్‌నాథ్ షిండేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తామే నిజమైన శివసేన అని చెప్పుకుంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన షిండే గ్రూపు అభ్యర్థనను కూడా ఇటీవల వారు సవాలు చేశారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గ్రూపు విప్‌ను శివసేన విప్‌గా గుర్తిస్తూ కొత్తగా నియమితులైన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చర్యను కూడా వారు సవాలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికీ శివసేన అధికార పార్టీ అధినేతగా ఉన్నందున షిండే నామినేట్ చేసిన విప్‌లను గుర్తించే అధికారం కొత్తగా నియమితులైన స్పీకర్‌కు లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

<p>శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే</p>
శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (HT PHOTO)

మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కోరుతూ ఠాక్రే శిబిరానికి చెందిన సునీల్ ప్రభు పిటిషన్ దాఖలు చేశారు.

IPL_Entry_Point