Ganesh Chaturthi:గ‌ణేశ్ ఉత్స‌వాల‌పై సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు-sc refuses to grant permission for ganesh chaturthi celebrations at idgah maidan in bengaluru ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ganesh Chaturthi:గ‌ణేశ్ ఉత్స‌వాల‌పై సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

Ganesh Chaturthi:గ‌ణేశ్ ఉత్స‌వాల‌పై సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

Sudarshan Vaddanam HT Telugu
Aug 30, 2022 08:17 PM IST

బెంగ‌ళూరులోని చ‌రిత్రాత్మ‌క ఈద్గా మైదాన్ వ‌ద్ద గ‌ణేశ్ మండ‌పాన్ని ఏర్పాటు చేసి, గ‌ణప‌తి ఉత్స‌వాలు జ‌ర‌పాల‌న్న ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ను సుప్రీంకోర్టు అడ్డుకుంది. బెంగ‌ళూరులోని చామ‌రాజ్‌పేట‌లో రెండున్న‌ర ఎకరాల్లో ఈ ఈద్గా మైదాన్ విస్త‌రించి ఉంది.

ఈద్గా మైదాన్ వ‌ద్ద మోహ‌రించిన పోలీసులు
ఈద్గా మైదాన్ వ‌ద్ద మోహ‌రించిన పోలీసులు

SC refuses Ganesh Chaturthi celebrations at Idgah Maidan : గ‌ణేశ్ చ‌తుర్ధి ఉత్స‌వాల‌ను ఈద్గా మైదాన్‌లో జ‌రుపుకోవ‌డానికి క‌ర్నాట‌క ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌వ‌చ్చ‌ని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై కర్నాట‌క వ‌క్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

SC refuses Ganesh Chaturthi celebrations at Idgah Maidan : స్టేట‌స్ కో

క‌ర్నాట‌క వక్ఫ్ బోర్డు పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. క‌ర్నాట‌క హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను నిలుపుద‌ల చేస్తూ, స్టేట‌స్ కో కొన‌సాగుతుంద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగ‌ళూరులోని ఈద్గా మైదాన్ వ‌ద్ద బుధ‌వారం ఎలాంటి గ‌ణేశ్ చ‌తుర్ధి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదే పిటిష‌న్‌ను మ‌ళ్లీ హైకోర్టులో వేసుకోవాల‌ని పిటిష‌న్‌దారుల‌కు సూచించింది. హైకోర్టు మ‌ళ్లీ ఉత్త‌ర్వులు ఇచ్చేవ‌ర‌కు య‌థాత‌థ స్థితి కొన‌సాగుతుంద‌ని, అంటే ఆ ఈద్గా మైదాన్ ప్రాంతాన్ని గ‌ణప‌తి ఉత్స‌వాల‌కు వాడుకోకూడ‌ద‌ని సుప్రీంకోర్టు త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం వివ‌రించింది.

SC refuses Ganesh Chaturthi celebrations at Idgah Maidan : బాబ్రీ మ‌సీదు విష‌యంలోనూ ఇలాగే చెప్పారు

ఈద్గా మైదాన్‌ను గ‌ణేశ్ ఉత్స‌వాలకు వినియోగించ‌డాన్ని కర్నాట‌క వ‌క్ఫ్ బోర్డు వ్య‌తిరేకించింది.గ‌త 200 సంవ‌త్స‌రాలుగా అక్క‌డ మరే ఇత‌ర మ‌త ఉత్స‌వాలు జ‌ర‌గ‌లేద‌న్న విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ఈద్గా మైదాన్ విస్త‌రించి ఉన్న రెండున్న‌ర ఎక‌రాల భూమికి ఎవ‌రు య‌జ‌మాని అన్న ప్ర‌శ్న ఉద్భ‌వించింది. ఈ ప్ర‌శ్న‌కు క‌ర్నాట‌క హైకోర్టు స‌మాధానం వెత‌కాల్సి ఉంది. కాగా విచార‌ణ స‌మ‌యంలో, బాబ్రీ మ‌సీదు అంశం తెర‌పైకి వ‌చ్చింది. రెండు రోజుల పాటు ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో `తాత్కాలిక నిర్మాణం`లో ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని, అంతేకానీ అక్క‌డ శాశ్వ‌త నిర్మాణాలేవీ చేప‌ట్ట‌బోమ‌ని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది సుప్రీంకోర్టుకు వివ‌రించారు. దీనిపై వెంట‌నే వ‌క్ఫ్ బోర్డు త‌ర‌ఫు న్యాయ‌వాది దుష్య‌త్ ద‌వే స్పందిస్తూ.. ``అప్ప‌ట్లో బాబ్రీమ‌సీదు విష‌యంలోనూ ఇలాగే చెప్పారు. అప్ప‌టి యూపీ ముఖ్య‌మంత్రే హామీ ఇచ్చారు. అక్కడేం జ‌రిగిందో మీకు తెలుసు`` అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 1992లో అయోధ్య‌లో బాబ‌రీ మ‌సీదును కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ``చ‌ట్టం ప్ర‌కారం అది వ‌క్ఫ్ స్థ‌లం. ఇక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కూ వేరే ఏ మ‌త కార్య‌క్ర‌మం కూడా జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు అక‌స్మాత్తుగా దాన్ని వివాదాస్ప‌ద స్థ‌లం అంటున్నారు`` అని ద‌వే వ్యాఖ్యానించారు. దీనిపై ప్ర‌భుత్వం త‌ర‌ఫ‌/ న‌్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ స్పందిస్తూ.. గ‌తంలో ఏ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేద‌న్న విష‌యం ప్ర‌స్తుత గ‌ణేశ్ ఉత్స‌వ‌ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవడానికి కార‌ణం కాబోద‌ని వాదించారు. ద‌స‌రా సందర్బంగా ఢిల్లీలో ప్ర‌తీచోట రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మం చేస్తారు. ఎవ‌రూ దాన్ని వ్యతిరేకించ‌లేదు. రెండు రోజుల పాటు ఈద్గా మైదాన్‌లో ఉత్స‌వాలు నిర్వ‌హిస్తే ఏం జ‌రుగుతుంది? అని ప్ర‌శ్నించారు. దీనిపై ద‌వే స్పందిస్తూ.. దేశంలో ఏ హిందూ దేవాల‌యంలోనైనా మైనారిటీలు ప్రార్థ‌న‌లు చేసుకోవ‌డానికి అనుమ‌తిస్తారా? అని ప్ర‌శ్నించారు.

SC refuses Ganesh Chaturthi celebrations at Idgah Maidan : కోర్టు భిన్నాభిప్రాయం

మొద‌ట ఈ కేసును ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం విచారించింది. అయితే, ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల మ‌ధ్య తీర్పు విష‌యంలో బేధాభిప్రాయం రావ‌డంతో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేశారు. వ‌చ్చే సంవ‌త్స‌రం బెంగ‌ళూరులో మున్సిప‌ల్‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇటీవ‌ల క‌ర్నాట‌క‌లో ప‌లు చోట్ల మ‌త ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే.

WhatsApp channel