NEET PG postponement : ‘నీట్ పీజీ వాయిదా వేయడం కుదరదు’- సుప్రీంకోర్టు
NEET PG 2023 postponement : నీట్ పీజీ 2023ను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది.
NEET PG postponement Supreme court : 2023 నీట్- పీజీ (నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్)ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కీలక తీర్పును వెలువరించింది. నీట్ పీజీని వాయిదా వేయడం కుదరదని, ఇప్పటికే ప్రకటించిన మార్చ్ 5 తేదీనే పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలని కొట్టివేసింది.
కౌన్సిలింగ్.. పరీక్ష..
నీట్ పీజీ 2023కి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించారు అధికారులు. అందుకు తగ్గట్టుగానే ఎడ్మిట్ కార్డులను సైతం విడుదల చేశారు. మార్చ్ 5న దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక జులై 15న కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. అయితే.. కౌన్సిలింగ్ ప్రక్రియ తేదీపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి కటాఫ్ డేట్ ఆగస్టు 11గా ఉంది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ డేట్‌ను కూడా ఆగస్టు 11కే మార్చాలని, అందుకు తగ్గట్టుగా నీట్ పీజీ పరీక్షను సైతం వాయిదా వేయాలని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.
NEET PG postponement news : ఈ వ్యవహారంపై జస్టిస్ ఎస్ ఆర్ భట్, జస్టిస్ దిపంకర్ దత్తతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి.. పరీక్షను వాయిదా వేయడం సరైనది కాదని పేర్కొన్నారు. అంతా షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని, మార్చ్ 5న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తే.. సమీప భవిష్యత్తులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మరో తేదీన ఎగ్జామ్‌ను నిర్వహించడం టెక్నికల్‌గా కష్టం అవుతుందని వివరించారు. ఇరు పక్షాల వాధనలు విన్న అత్యుత్తమ న్యాయస్థానం.. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయకూడదని నిర్ణయించింది.
2.09లక్షల మంది అభ్యర్థులు..
NEET PG Supreme Court : ఈ దఫా నీట్ పీజీ పరీక్షకు 2.09లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వైద్య వృత్తిలో పీజీకి సంబంధించి ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తుంటారు. అయితే.. నీటీ పీజీ పరీక్ష రాయాలంటే.. కనీసం 1 ఏడాది పాటైనా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది.. ఇంటర్న్‌షిప్ చివరి తేదీని జూన్ 30గా ప్రకటించింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఆ తర్వాత విద్యార్థుల ప్రయోజనం కోసం.. ఆ కటాఫ్ డేట్‌ను ఆగస్ట్ 11కు మార్చింది.
నీట్ పీజీ పరీక్ష కోసం వైద్య విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు.