NEET UG 2024 : ‘నీట్ రద్దు’ పిటిషన్లపై ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు..
నీట్ యూజీ 2024 వివాదం నేపథ్యంలో కేంద్రం, ఎన్టీఏకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ‘పరీక్ష పట్ల ఉండే పవిత్ర భావం దెబ్బతింది’ అని వ్యాఖ్యానించింది.
Supreme court on NEET UG 2024 : నీట్ 2024 చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ), కేంద్రానికి నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై స్పందించాలని తెలిపింది.
"మీరు పరీక్ష నిర్వహించినంత మాత్రానా.. అంతా పవిత్రంగానే ఉందుకోవడానికి ఇక్కడే ఏం లేదు. పరీక్ష పట్ల ఉండే పవిత్ర భావం దెబ్బతింది. మాకు సమాధానాలు కావాలి," అని ఎన్టీఏపై ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.
'కౌన్సిలింగ్ కొనసాగుతుంది..'
కాగా.. నీట్ యూజీ 2024కు సంబంధించిన కౌన్సిలింగ్ని మాత్రం నిలిపివేసేందుకు నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం.
"కౌన్సిలింగ్ని మేము ఆపము. కౌన్సిలింగ్ కొనసాగుతుంది," అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అశనుద్దిన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నీట్ రద్దుతో పాటు ఈ పరీక్షకు సంబంధించిన అన్ని పిటిషన్ల విచారణను జులై 8కి వాయిదా వేసింది. నాడు.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఈ పిటిషన్లను విచారించనున్నారు.
నీట్ 2024 చుట్టూ ఇదీ వివాదం..
NEET UG 2024 latest updates : నీట్ యూజీ 2024ని ఆది నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. మే 5న పరీక్ష జరగ్గా.. దాని కన్నా ముందే పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై బిహార్‌లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక విద్యార్థులకు అసలు షాక్.. నీట్ యూజీ 2024 పరీక్షలు విడుదలైన తర్వాత తగిలింది! ఈ పరీక్షలో సాధారణంగా.. ఇద్దరు, ముగ్గురికి మొదటి ర్యాంక్ వస్తుంది. కానీ ఈసారి.. ఏకంగా 67మంది 720/720 సాధించినట్టు ఫలితాల్లో తేలింది. ఇది దేశంలోని మెడికల్ అకాడమీలను షాక్‌కు గురిచేసింది.
మరోవైపు.. ఎన్నడూ లేని విధంగా.. ఈసారి చాలా మందికి 718, 719 మార్కులు వచ్చాయి. పరీక్ష నిర్వహించే పద్ధతి బట్టి.. 720 తర్వాత 716 లేదా 715 మార్కులు వస్తాయే కానీ.. 718,719 మార్కులు సాధించడం కుదరదు. కానీ ఈసారి.. వివిధ సెంటర్లలో పరీక్ష నిర్వహణ ఆలస్యమైన నేపథ్యంలో.. సంబంధిత అభ్యర్థులకు 'గ్రేస్ మార్కులు' వేయడం వల్ల కొత్త నెంబర్లు కనిపించాయని ఎన్టీఏ వివరణ ఇచ్చింది.
NEET UG 2024 protests : దీనిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. గ్రేస్ మార్క్ విషయంలో ఎన్టీఏ పారదర్శకంగా లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకప్పుడు 650 మార్కులు వస్తే.. మంచి వైద్య కళాశాలలో చేరే అవకాశం ఉండేది. కానీ ఇలా 67 మందికే మొదటి ర్యాంక్, గ్రేస్ మార్కుల కారణంగా.. ఈసారి కటాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్లు.. రోడ్ల మీద కొచ్చి నీట్ యూజీ 2024కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
ఇంకొందరు.. నీట్ యూజీ 2024 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
NEET UG 2024 scam : "గ్రేస్ మార్కుల విషయంలో అసలు లాజిక్ కనిపించడం లేదు. ఎవరెవరికి గ్రేస్ మార్కులు వేశారో ఎలాంటి లిస్ట్ ఇవ్వలేదు. సమయం వృథా అయితే.. గ్రేస్ మార్క్‌లు వేస్తామని పరీక్ష ముందు చెప్పలేదు. ఒకే కోచింగ్ సెంటర్‌కి చెందిన ఆరుగురికి ఫుల్ మార్క్‌లు వచ్చాయి. నీట్‌ని రద్దు చేయాలి," అని పిటిషనర్లు తమ పిటిషనన్లలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సమయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2024 జూన్ 14న ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. అవి జూన్ 4, లోక్‌సభ ఎన్నికల హడావుడి మధ్య విడుదలయ్యాయి.
మరోవైపు.. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించేందుకు.. ఒక హైకమిటీని వేస్తున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది.
సంబంధిత కథనం