SBI interest rates hike: వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ
SBI interest rates hike: భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ వడ్డీ రేట్లు పెంచింది. నెల రోజుల వ్యవధిలో వడ్డీ రేట్లు పెంచడం ఇది రెండోసారి.
SBI interest rates hike: భారతదేశపు అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిధుల ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (MCLR) పెంచింది. నేటి నుంచి ఈ వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుంది. ఈ చర్య ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై ఈఎంఐలను భారంగా మార్చనుంది. హౌజింగ్ లోన్స్ వంటి దీర్ఘకాలిక రుణాలు ఈ రేటుతో అనుసంధానమై ఉంటాయి. రిటైల్ రుణాల కోణంలో చూస్తే ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
ట్రెండింగ్ వార్తలు
ఓవర్‌నైట్ (ఒకరోజు) నుండి మూడు నెలల వ్యవధి గల ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ రేటు 7.15 శాతం నుండి 7.35 శాతానికి పెరిగింది. ఎస్‌బీఐ ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం నుండి 7.65 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 7.7 శాతానికి, రెండేళ్ల కాలానికి 7.7% నుండి 7.9 శాతానికి, మూడేళ్ల కాలానికి 7.8% నుంచి 8 శాతానికి పెరుగుతుంది.
గత నెలలో ఎస్‌బీఐ వివిధ కాల వ్యవధుల్లో ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ల మార్జినల్ కాస్ట్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఎంసీఎల్ఆర్ ఏప్రిల్ 2016 నుంచి అమలవుతోంది. దీనిలో బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని లెక్కించేందుకు ఒక ఫార్ములా అనుసరిస్తాయి. వివిధ కాల వ్యవధిలో వారి ఆఫర్‌ల గురించి నెలవారీ సమీక్ష నిర్వహిస్తాయి. ప్రతి బ్యాంకు తన డిపాజిట్లను పెంచడానికి అయ్యే ఖర్చు, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దాని ఎంసీఎల్ఆర్ లెక్కిస్తుంది.
ఎంసీఎల్ఆర్ ఆ తర్వాత లింక్డ్ రేట్ ద్వారా భర్తీ చేస్తారు. తద్వారా రుణ రేటు నేరుగా పాలసీ కదలికలతో పాటు మారుతుంటాయి. ఇప్పటికే ఉన్న అన్ని ఫ్లోటింగ్ రేట్ బ్యాంక్ రుణాలు ఎంసీఎల్ఆర్ లేదా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) లేదా బేస్ రేట్‌కి లింక్ అయ్యాయి.
ఈబీఎల్ఆర్ రుణాలు రిటైల్ రుణాల విషయంలో అయితే రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటు) తో లింక్ అవ్వాలి.
SBI తాజా MCLR రేట్లు
ఓవర్ నైట్ - 7.35%
ఒక నెల - 7.35%
మూడు నెలలు - 7.35%
ఆరు నెలలు - 7.65%
ఒక సంవత్సరం - 7.7%
రెండు సంవత్సరాలు - 7.9%
మూడు సంవత్సరాలు - 8%
రిజర్వ్ బ్యాంక్ ఈ నెలలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో చాలా బ్యాంకులు రుణగ్రహీతలపై విధించే వివిధ రకాల రుణ రేట్లను పెంచాయి.
రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ గత వారం వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ వివిధ రకాల కాల వ్యవధులపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రస్తుతం సాధారణ ప్రజలకు 2.90% నుండి 5.65% వరకు, సీనియర్ సిటిజెన్లకు 3.40% నుండి 6.45% వరకు వడ్డీ రేట్లతో ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వీకరిస్తోంది.