Satyendar Jain: ఆక్సీజన్ సపోర్ట్ పై ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్; తిహార్ జైలు బాత్రూమ్ లో పడిపోయిన ఆప్ నేత
Satyendar Jain: మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైళ్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నారు.
Satyendar Jain: మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో, జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తిహార్ జైళ్లో ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు.
Satyendar Jain on oxygen support: బాత్రూంలో పడిపోయారు..
తీవ్రమైన వెన్నునొప్పి, తదితర సమస్యలతో రెండు రోజుల క్రితం తిహార్ జైళ్లోని వైద్య చికిత్స విభాగంలో ఆయన చేరారు. గురువారం ఉదయం ఆ ఆసుపత్రిలోని బాత్రూమ్ లో పడిపోవడంతో సత్యేంద్ర జైన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో, తిహార్ మెడికల్ టీమ్ సిఫారసుతో సత్యేంద్ర జైన్ ను మొదట దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఎక్స్ రే, స్కాన్.. తదితర టెస్ట్ లు చేసిన తరువాత, ఉదయం 10 గంటల సమయంలో లోక్ నాయక్ ఆసుపత్రికి మార్చారు. వెన్నుభాగం, భుజాలు, మోకాళ్ల భాగంలో తీవ్రమైన నొప్పితో సత్యేంద్ర జైన్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. గత సంవత్సరం తిహార్ జైళ్లో కింద పడిన నాటి నుంచి ఈ సమస్యలతో జైన్ బాధ పడుతున్నారని ఆప్ తెలిపింది. సరైన చికిత్స అందించకుండా జైలు అధికారుల నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించింది. అప్పుడే వెన్నుముకకు సర్జరీ చేసి ఉంటే బావుండేదని పేర్కొంది.
Money Laundering case: బెయిల్ పిటిషన్
బెయిల్ కోరుతూ సత్యేంద్ర జైన్ ఈ మే 15న సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. తన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన ఈ పిటిషన్ వేశారు. సత్యేంద్ర జైన్ ను మనీ లాండరింగ్ కేసులో మే 30, 2022 న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.