Supreme Court: కునాల్ కమ్రా వివాదం నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు-satire makes life more meaningful scs freedom of speech reminder amid kunal kamra controversy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: కునాల్ కమ్రా వివాదం నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: కునాల్ కమ్రా వివాదం నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Sudarshan V HT Telugu

Kunal Kamra: కమేడియన్ కునాల్ కమ్రా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేల మధ్య వివాదం నేపథ్యంలో.. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ సహా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడం కోర్టుల బాధ్యత అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు (HT_PRINT)

Kunal Kamra: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే పై కమెడియన్ కునాల్ కమ్రా వేసిన జోక్ తీవ్ర వివాదానికి దారి తీసిన నేపథ్యంలో, భావ ప్రకటన స్వేచ్ఛ సహా పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోర్టుల కర్తవ్యమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలతో కూడిన సాహిత్యం మానవుల జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుందని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హిపై గుజరాత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ, కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

ఇతరుల భావాలను గౌరవించాలి

‘‘చాలా మంది వ్యక్తులు ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇష్టపడకపోయినా, ఆ అభిప్రాయాలను వ్యక్తపరిచే వ్యక్తి యొక్క హక్కును గౌరవించాలి. పరిరక్షించాలి. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలతో సహా సాహిత్యం మానవుల జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది’’ అని ధర్మాసనం పేర్కొంది.

కోర్టుల బాధ్యత

పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోర్టు కర్తవ్యమని, ముఖ్యంగా వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి పౌరుల హక్కులకు కోర్టులు బాసటగా నిలవాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై కమేడియన్ కునాల్ కమ్రా ఇటీవల వ్యంగ్యంగా వేసిన జోక్ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కునాల్ కమ్రా కామెంట్స్ పై పెద్ద ఎత్తున వివాదం, వాదోపవాదాలు, స్వేచ్ఛపై చర్చ జరుగుతున్నాయి

ఇమ్రాన్ ప్రతాప్ గర్హి కేసు

కాంగ్రెస్ మైనారిటీ సెల్ జాతీయ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి జనవరి 17న గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేశారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.

రెచ్చగొట్టే పాటను షేర్ చేశారని..

జనవరి 3న జామ్ నగర్ లో జరిగిన ఓ సామూహిక వివాహ వేడుకకు సంబంధించి రెచ్చగొట్టే పాటను షేర్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ మైనారిటీ సెల్ జాతీయ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గర్హిపై కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్ 196 (మతం, జాతి మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 197 (జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలు) సహా అనేక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

జాతి ఐక్యతకు విఘాతం కలిగించేలా

ఎక్స్ లో ప్రతాప్ గర్హి అప్ లోడ్ చేసిన 46 సెకన్ల వీడియో క్లిప్ లో అతను నడుస్తూ, చేతులు ఊపుతూ, పూల రేకులు తనపై కురిపిస్తున్నప్పుడు, బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాట ప్లే అవుతోంది. ఈ పాట లిరిక్స్ రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతీయ ఐక్యతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

కునాల్ కమ్రా వివాదం

కమెడియన్ కునాల్ కమ్రా యూట్యూబ్ మరియు అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన తాజా స్టాండప్ గిగ్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మద్దతుదారులకు కోపం తెప్పించింది. వారు ఆదివారం ముంబైలో ఈ వీడియోను చిత్రీకరించిన వేదికను ధ్వంసం చేయడంతో పాటు అతన్ని బెదిరించారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విడిపోయిన వర్గాలను ప్రస్తావిస్తూ మహారాష్ట్ర రాజకీయాలు, అక్కడి ఎన్నికలపై కునాల్ కమ్రా ఈ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల్లో మొదట బీజేపీ నుంచి శివసేన విడిపోయింది.. ఆ తర్వాత శివసేన రెండుగా విడిపోయింది. ఆ తరువాత ఎన్సీపీ రెండు ముక్కలైంది. ఎన్నికల్లో ఓటరుకు తొమ్మిది ఆప్షన్లు ఇచ్చారు. దాంతో, అందరూ అయోమయానికి గురయ్యారు'' అని కునాల్ కమ్రా అన్నారు. ‘ఇదంతా ఒక వ్యక్తి మొదలు పెట్టాడు. ఆయన ముంబైలోని ప్రముఖ ప్రాంతం అయిన థానే నుంచి వచ్చాడు’’ అని ఏక్ నాథ్ షిండే గురించి కునాల్ కమ్రా వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఆ తరువాత 'దిల్ తో పాగల్ హై' చిత్రంలోని ఒక పాటను పాడడం ప్రారంభించారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.