భారత మాజీ క్రికెటర్ గంగూలీ కుమార్తెకి తృటిలో తప్పిన ప్రమాదం- ఏం జరిగిందంటే..
Sana Ganguly car accident : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కోల్‌కతాలో ఆమె కారును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయలవ్వలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీకి తృటిలో ప్రమాదం తప్పింది. కోల్‌కతాలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సనా గంగూలీకి ఎలాంటి గాయాలవ్వలేదు.
ఇదీ జరిగింది..
కోల్‌కతాలోని బెహలా చౌరస్తా ప్రాంతంలో కారులో సనా గంగూలీ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ పక్కన సీటులో సనా కూర్చుని ఉంది.
అయితే, బస్సు ఢీకొట్టడంతో కారు స్వల్పంగా దెబ్బతింది. కానీ లోపల కూర్చున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన తర్వాత బస్సు వేగంగా వెళ్లిపోయింది. సనా గంగూలీ కారు డ్రైవర్.. బస్సును వెంబడించారు. సఖేర్ బజార్ సమీపంలో ఛేజ్ చేసి బస్సును ఆపారు. మరోవైపు పోలీసులకు ఫోన్ చేసిన సనా గంగూలీ, జరిగిన విషయాన్ని వివరించినట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.
సనా గంగూలీ ఎవరు?
సౌరవ్ గంగూలీ- ఆయన భార్య, ప్రఖ్యాత ఒడిస్సీ నృత్యకారిణి డోనా ఏకైక సంతానం సనా గంగూలీ. కోల్‌కతాలోని లోరెటో హౌస్‌లో తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించింది. యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పొందింది. ప్రస్తుతం ఆమె లండన్‌కు చెందిన బొటిక్ కన్సల్టింగ్ సంస్థ ఇన్నోవర్వీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది.
సామాజిక వ్యవస్థాపకతపై దృష్టి సారించిన ఆక్టోటస్ అనే సంస్థతో పనిచేసిన అనుభవం సనా గంగూలీకి ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ అయిన ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ తోనూ ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్నోవర్విలో ప్రస్తుత పాత్రకు ముందు, ఆమె డెలాయిట్‌లో ఇంటర్న్‌గా పనిచేసింది.
కాగా గత ఏడాది ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా సౌరవ్, డోనా, సనా గంగూలీలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ.. 'మాకు న్యాయం కావాలి. ఈ ఘటనలు ఆగిపోవాలి. ప్రతిరోజూ ఏదో ఒక రేప్ కేసు గురించి వింటున్నాము. 2024లో కూడా ఇలా జరగడం బాధాకరం," అని సనా గంగూలీ అన్నారు.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2019 డిసెంబర్లో సనా గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ చేసింది. అయితే, సౌరవ్ గంగూలీ ఈ పోస్టులో నిజం లేదని, ఇలాంటి సమస్యలన్నింటికీ ఆమెను దూరంగా ఉంచాలని ప్రజలను కోరారు.
సంబంధిత కథనం