Salman Khan: “సల్మాన్ ఖాన్‍ను ఏప్రిల్ 30న చంపేస్తాం”.. మరో బెదిరింపు కాల్: ముంబై పోలీసుల దర్యాప్తు
Salman Khan: ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‍ను ఏప్రిల్ 30న చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలివే..
Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‍కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. రాజస్థాన్‍లోని జోధ్‍పూర్ నుంచి కాల్ చేస్తున్నానని, తన పేరు రోకీ భాయ్ (Roki Bhai) అని ఓ వ్యక్తి.. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‍కు కాల్ చేశాడు. ఏప్రిల్ 30వ తేదీన సల్మాన్ ఖాన్‍ను హత్య చేస్తానని కాల్‍లో అతడు బెదిరించాడు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‍కు ఈ కాల్ సోమవారం రాత్రి 9 గంటలకు వచ్చింది. ఈ బెదిరింపు కాల్‍పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణ చేస్తున్నాం
Salman Khan: “పోలీస్ కంట్రోల్ రూమ్.. నిన్న రాత్రి అందుకున్న ఓ కాల్‍లో ఓ వ్యక్తి తనను తాను రోకీ భాయ్ అని చెప్పుకున్నాడు. తాను రాజస్థాన్‍లోని జోధ్‍పూర్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పాడు. ఏప్రిల్ 30న నటుడు సల్మాన్ ఖాన్‍ను చంపుతానని బెదిరించాడు. ఈ విషయంపై విచారణ చేస్తున్నాం” అని ముంబై పోలీసులు వెల్లడించారు.
బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి..
Salman Khan: ఇటీవల గ్యాంగ్‍స్టర్ గోల్డీ బ్రార్ నుంచి కూడా సల్మాన్ ఖాన్‍కు బెదిరింపులు ఎదురయ్యాయి. గతేడాది పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్న బ్రార్.. సల్మాన్‍ను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపు మెయిల్ పంపాడు. ఈ విషయంలో గ్యాంగ్‍స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ బ్రార్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Salman Khan: క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో రక్షణ కోసం సల్మాన్ ఖాన్ ఇటీవల బల్లెట్ ఫ్రూఫ్ నిస్సాన్ ఎస్‍యూవీని కొనుగోలు చేశారు. రెండు రోజుల క్రితమే ఈ కారు సల్మాన్ వద్దకు చేరింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును సల్మాన్.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. సౌత్ ఆసియాలో ఈ కారు చాలా పాపులర్‌గా ఉంది.
Salman Khan: ఇక సినిమాల విషయానికి వస్తే, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) మూవీ ప్రమోషన్లలో సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నారు. సోమవారం రోజునే ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. స్టైలిష్ లుక్‍తో ఈ ఈవెంట్‍కు సల్మాన్ హాజరయ్యారు. సినిమాలో నటించిన పూజా హెగ్డే, షెహనాజ్ గిల్, రాఘన్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, భూమికా చావ్లాతో పాటు చాలా మంది ఈ ఈవెంట్‍లో పాల్గొన్నారు. మొత్తంగా ఈ ట్రైలర్ 3.25 సెకన్ల నిడివితో ఉంది. ఈనెల 21 తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
సంబంధిత కథనం