26/11 attacks: ఆసుపత్రిలో వెంటిలేటర్ పై 26/11 దాడుల కుట్రదారు, పాకిస్తాన్ ఉగ్రవాది సాజిద్ మీర్; ఇది కూడా ఐఎస్ఐ కుట్రేనా?
26/11 attacks: మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా టెర్రరిస్ట్ సాజిద్ మీర్ పై పాకిస్తాన్ జైలులో విషప్రయోగం జరిగినట్లు సమాచారం. ఆయన ఇప్పుడు ఒక ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వయస్సు 40 ఏళ్లు ఉండొచ్చు.
26/11 attacks: పాక్ లో లష్కరే తోయిబా సహా పలు ఉగ్ర సంస్థల కీలక నేతల మరణాల మిస్టరీ కొనసాగుతోంది. ఇప్పడు తాజాగా, మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సాజిద్ మీర్ మరణం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. పాకిస్తాన్ లో జైళ్లో ఉన్న ఆయనపై విష ప్రయోగం జరిగిందని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నాడని తెలుస్తోంది.

ముంబై దాడుల సూత్రధారి..
సాజిద్ మీర్ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించేవాడు. ముంబైపై జరిగిన 26/11 ఉగ్ర దాడుల ప్రధాన సూత్రధారుల్లో సాజిద్ మిర్ కూడా ఒకడు. ఆ దాడుల సందర్భంగా దాడులు చేసేవారిని రిక్రూట్ చేయడం నుంచి వారికి ముంబైలో అవసరమైన సమాచారం అందించేవరకు సాజిద్ మీర్ కీలకంగా వ్యవహరించాడు. భారత్ లో జరిగిన పలు ఇతర ఉగ్రదాడుల వెనుక కూడా సాజిద్ మీర్ ఉన్నాడు.
పాకిస్తాన్ జైళ్లో..
సాజిద్ మీర్ ప్రస్తుతం పాకిస్తాన్ లోని కోట్ లక్పత్ జైళ్లో ఉన్నాడు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం చేసిన నేరంపై అతడికి స్థానిక ఉగ్రవాద వ్యతిరేక కోర్టు గత సంవత్సరం 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాక్ కు ఆర్థిక సాయం, రుణాలు అందించడానికి ఆ దేశంలోని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలన్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనల మేరకు పాక్ సాజిద్ మీర్ ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టింది.
5 మిలియన్ డాలర్లు..
26/11 దాడులలో సాజిద్ మీర్ పాత్రను నిర్ధారించిన అమెరికా ప్రభుత్వం.. అతడి వివరాలు తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది. మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించి, అతని ఆస్తులను స్తంభింపజేయాలని, ప్రయాణ నిషేధాన్ని విధించాలని అమెరికా, ఇండియా చేసిన ప్రతిపాదనను గతంలో ఐరాస ఆమోదించింది.
ఇది కూడా కుట్రేనా..
అయితే, సాజిద్ మీర్ ను విష ప్రయోగం పేరుతో ఆసుపత్రిలో చేర్చడం కూడా పాకిస్తాన్ (pakistan) ప్రభుత్వం, ఆ దేశ నిఘా విభాగం ఐఎస్ఐ (ISI) కుట్రేనన్న వాదన వినిపిస్తోంది. సాజిద్ మీర్ ను అమెరికాకు అప్పగించడాన్ని తప్పించే లక్ష్యంతో ఈ నాటకానికి తెర తీశారని భావిస్తున్నారు. అవసరమైతే, సాజిద్ మీర్ చనిపోయాడని కూడా ప్రకటించే అవకాశముందని, తద్వారా అతడిపై అమెరికా సహ అంతర్జాతీయ సమాజం చర్యలను అడ్డుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారని వాదిస్తున్నారు.