Saif Ali Khan: ‘సైఫ్ రక్తమోడుతూ సింహంలా లోపలికి నడిచి వచ్చాడు’ - వైద్యుడి కామెంట్
Saif Ali Khan: కత్తిపోటు గాయాలతో రక్తమోడుతూ బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రి లోపలికి సింహంలా వచ్చాడని ఆ ఆసుపత్రి వైద్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. స్ట్రెచర్ ను ఉపయోగించడానికి కూడా సైఫ్ నిరాకరించాడని వెల్లడించారు.
Saif Ali Khan: దుండగుడి చేతిలో తీవ్రంగా గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించిన ఆటోరిక్షా డ్రైవర్ తన అనుభవాన్ని మీడియాకు వివరించాడు. గాయపడిన నటుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో జరిగిన విషయాలను వివరించాడు. గాయపడిన నటుడిని తాను సైఫ్ అలీఖాన్ అని గుర్తించలేదని ఆ డ్రైవర్ తెలిపారు.
తెల్లని కుర్తా రక్తంతో ఎర్రగా మారింది
తన ఆటోలోకి ఎక్కిన సమయంలో సైఫ్ అలీఖాన్ కు తీవ్రంగా రక్తస్రావం అవుతోందని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా తెలిపారు. ఆసుపత్రికి చేరుకోవడానికి తనకు 8-10 నిమిషాలు పట్టిందని చెప్పారు. ‘‘సైఫ్ అలీఖాన్ మెడ నుంచి రక్తస్రావం అవుతోంది. అతని తెల్లని కుర్తా ఎరుపు రంగులోకి మారింది. అయినా, అతడు భయపడుతున్నట్లు కనిపించలేదు’’ అని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా తెలిపారు. ఆ సమయంలో సైఫ్ తో పాటు ఓ బాలుడు కూడా ఉన్నాడని చెప్పారు. "అతడు తానే స్వయంగా నడుచుకుంటూ నా ఆటో వైపు వచ్చాడు. అతనితో పాటు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. అతడు నటుడు సైఫ్ అని నేను గుర్తించలేదు. అతడు గాయపడిన స్థితిలో ఉన్నాడు. నేను అతన్ని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకున్నాను. ఎనిమిది నుంచి పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకున్నాం' అని రాణా వివరించారు.
ఒక మహిళ కేకలు విని..
గురువారం తెల్లవారుజాము సమయంలో తాను ఆటోలో వెళ్తుండగా, తనకు ఆటో ఆటో అంటూ కేకలు ఓ మహిళ కేకలు వినిపించాయని, రోడ్డుకు అటువైపు నుంచి ఆ కేకలు రావడంతో యూ టర్న్ తీసుకుని ఆ భవనం వైపు వెళ్లానని భజన్ సింగ్ రాణా తెలిపాడు. ‘‘అయితే, సైఫ్ అలీఖాన్ గేటు వద్దే నా ఆటో ఎక్కాడు. త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరాడు. అతడిలో ఎలాంటి భయం కనిపించలేదు. అతడితో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా ఆటో ఎక్కాడు. వారిని 10 నిమిషాల్లోపే ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఆ సమయంలో సైఫ్ అలీఖాన్ తెల్లని కుర్తా రక్తంతో తడిచి ఎర్రగా మారింది. అతడి మెడ భాగం నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. ఆసుపత్రికి చేరుకున్న తరువాత తానే దిగి లోపలికి నడిచి వెళ్లాడు. ప్రశాంతంగా ఆటోలోంచి దిగాడు’’ అని డ్రైవర్ భజన్ సింగ్ రాణా వివరించాడు. వారి నుంచి తాను డబ్బులు తీసుకోలేదన్నాడు.
'సైఫ్ అలీ ఖాన్ సింహంలా వచ్చాడు'
ఆటో నుంచి దిగిన తర్వాత సైఫ్ స్వయంగా లోపలికి నడిచి వచ్చాడని లీలావతి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో తానే లోపలికి నడుచుకుంటూ వచ్చాడని, స్ట్రెచర్ ను కూడా నిరాకరించాడని వెల్లడించాడు. సైఫ్ అలీ ఖాన్ సింహంలా లీలావతి ఆసుపత్రిలోకి వచ్చాడని, స్ట్రెచర్ కూడా ఉపయోగించడానికి నిరాకరించాడని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు శుక్రవారం తెలిపారు. తన పిల్లలకు, సిబ్బందికి హాని తలపెట్టకుండా అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ అలీఖాన్ (saif ali khan) ను గురువారం పలుమార్లు కత్తితో పొడిచారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
టాపిక్