Saif Ali Khan stabbing case : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు అనుమానితుడు అరెస్ట్
Saif Ali Khan stabbing case : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు అనుమానితుడిని ముంబై పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చొరబడి, ఆయనపై దాడి చేసింది ఇతనేనా? కాదా? అన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక అప్డేట్! తీవ్ర కలకలం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చొరబడి, ఆయనపై దాడి చేసింది ఇతనేనా? కాదా? అన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాగా నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు తీవ్రస్థాయిలో చర్యలు చేపట్టారు. టెక్నికల్ డేటాను ఉపయోగించి, 20 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఒక అనుమానితుడిని శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు వివరాలు..
ముంబై బాంద్రా ప్రాంతంలోని విలాసవంతమైన సైఫ్ అలీ ఖాన్ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున ఒక దుంగడుగు చొరబడ్డాడు. ఇంట్లో దొంగతనానికి ప్రయత్నిస్తున్న అతడిని సైఫ్ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడిని ఆ వ్యక్తి పలుమార్లు కత్తితో పొడిచాడు.
'సద్గురు శరణ్' భవనంలోని 12వ అంతస్తులో సైఫ్ కుటుంబం నివాసముంటోంది. ఘటన జరిగిన సమయంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య, నటి కరీనా కపూర్, వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల జెహ్, ఎనిమిదేళ్ల తైమూర్.. తమ ఐదుగురు ఇంటి సహాయకులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు.
తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరు కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్‌ను నగరంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఫలితంగా సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. అయితే సైఫ్ అలీఖాన్ వెన్నెముకలో నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తిని తొలగించినట్టు,లీకైన వెన్నెముక ద్రవాన్ని సరిచేయడానికి శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. దాడి కారణంగా థొరాసిక్ వెన్నెముకకు తీవ్ర గాయమైందని, ఆయనను ఐసీయూకు తరలించినట్టు, ప్రస్తుతం కోలుకుంటున్నారని వివరించారు.
లోపలి నుంచే సాయం అందిందా?
మరోవైపు ఘటన జరిగిన సమయంలో సైఫ్ అలీఖాన్ నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బ్రౌన్ టీషర్ట్, కాలర్, ఎరుపు కండువా ధరించిన ఓ వ్యక్తి ఆరో అంతస్తులోని మెట్లు దిగుతూ కనిపించాడు. సదరు వ్యక్తి.. సైఫ్ అలీ ఖాన్‌పై కర్ర, పొడవైన హెక్సా బ్లేడ్‌తో దాడి చేసి తప్పించుకునే క్రమంలో కెమెరాకు చిక్కినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం.. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తిని.. బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర గుర్తించారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతను బట్టలు మార్చుకున్నాడు.
హై సెక్యూరిటీ, విలాసవంతమైన సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి దుండగుడు చొరబడటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి! అతడికి లోపలి నుంచి సాయం అందిందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ ఇంట్లో పనిచేసే వారిలో ఎవరైనా దుండగుడికి సాయం చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఆ భవనం లేఅవుట్ తెలిసి ఉంటుందని భావిస్తున్నారు.
సైఫ్ అలీ ఖాన్‌పై ఎందుకు దాడి చేశాడు?
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరు? అన్న దానిపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ బాలీవుడ్ నటుడి ఇంట్లోకి అతను చొరబడటానికి గల కారణం మాత్రం తెలుస్తోంది. సైఫ్ కుమారుడు జేహ్ రూమ్‌లోకి చొరబడిన దుండగుడు.. రూ. 1కోటి డిమాండ్ చేసినట్టు సమాచారం.
సంబంధిత కథనం