Saif Ali Khan : 48 గంటలు గడిచినా ఇంకా చిక్కని నిందితుడు! అసలేం జరుగుతోంది?
Saif Ali Khan news today : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ఇంకా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు! 48 గంటలు గడిచినా నిందితుడిని ఇంకా చిక్కలేదు!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచిన ఘటన జరిగి 48 గంటలు దాటింది. ఈ కేసుకు సంబంధించి 30కి పైగా పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నా.. నిందుతుడు మాత్రం చిక్కడం లేదు! శుక్రవారం ఉదయం ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. విచారణ చేపట్టిన అనంతరం, కొన్ని గంటల్లోనే విడిచిపెట్టేశారు. ఇక అసలు నిందితుడిని పట్టుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టారు.
అండవరల్డ్తో సంబంధం లేదు..!
మరోవైపు సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నారని, రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ఆయన చికిత్స పొందుతున్న లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
“సైఫ్ ఆరోగ్యంపై పురోగతిని గమనిస్తున్నాము. మా అంచనాలకు అనుగుణంగా ఆయన అద్భుతంగా రికవర్ అవుతున్నాడు. ఆయన పురోగతిని బట్టి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించాము. ఆయన సౌకర్యవంతంగా ఉంటే రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము,” అని లీలావతి ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే తెలిపారు.
అయితే, సైఫ్ అలీఖాన్ దాడిపై మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్ స్పందించారు. బాలీవుడ్ నటుడుపై జరిగిన దాడితో అండర్ వరల్డ్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.
సైఫ్ అలీఖాన్ పై దాడి: ఇప్పటి వరకు తెలిసిన విషయాలు:
- 54 ఏళ్ల సైఫ్ అలీఖాన్‌పై గురువారం తెల్లవారుజామున తన అపార్ట్మెంట్లో దాడి చేసిన కేసులో ముంబై పోలీసులు ఓ కార్పెంటర్ని అదుపులోకి తీసుకుని శుక్రవారం ఉదయం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. అనంతరం విడుదల చేశారు.
- అనుమానిత దుండగుడు ఏ క్రిమినల్ ముఠా కోసం పనిచేయడం లేదని, అతను ఎవరి ఇంట్లోకి ప్రవేశించాడో కూడా తెలియదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
- సైఫ్‌ను 12వ అంతస్తు అపార్ట్మెంట్లో దోపిడీ యత్నంలో కత్తితో పొడిచిన దుండగుడి ఆచూకీ కోసం 30కి పైగా బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
- దుండగుడి ముఖం సీసీటీవీ కెమెరా ఫుటేజీలో రికార్డయింది. సైఫ్ నివసిస్తున్న 'సద్గురు శరణ్' భవనంలోని ఆరో అంతస్తు నుంచి తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో దుండగుడు ఎర్ర కండువా ధరించి, బ్యాక్‌ప్యాక్‌తో మెట్లు దిగుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.
- శస్త్రచికిత్స సమయంలో నటుడి వెన్నెముకలో ఉన్న 2.5 ఇంచ్ కత్తి ముక్కను వైద్యులు తొలగించారు. కత్తి కేవలం 2 మిల్లీమీటర్ల లోతుకు వెళ్లి ఉంటే తీవ్ర గాయాలయ్యేదని వారు గుర్తించారు.
- పదునైన వస్తువు, కత్తి బ్లేడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- సైఫ్ రక్తంతో తడిసిపోయాడని, కానీ బాంద్రాలో ఉన్న ఆసుపత్రికి సింహంలా వచ్చాడని డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు.
- ఈ దాడికి సంబంధించి నటి కరీనా కపూర్ ఖాన్ బాంద్రా పోలీసుల వద్ద తన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె నివాసంలో పోలీసు అధికారుల సమక్షంలో వాంగ్మూలం నమోదు చేశారు.
- దాడికి సంబంధించి ఇప్పటి వరకు 30 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేశారు.
- సైఫ్‌ని ఆటోరిక్షా డ్రైవర్ భజన్ సింగ్ రాణా తన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లడం మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. రక్తంతో తడిసిన కుర్తాతో లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రయాణికుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ నటుడు ఖాన్ అని తనకు తెలియదని రాణా అన్నారు.
సంబంధిత కథనం