Saif Ali Khan: ‘పిల్లల రూమ్ లో నుంచి అరుపులు వినిపించాయి.. వెంటనే ఆ గదిలోకి పరిగెత్తాను’- సైఫ్ అలీ ఖాన్
Saif Ali Khan: గత వారం తన నివాసంలో జరిగిన కత్తిపోట్ల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తమ కుమారుల గదిలో నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత అరుపులు వినిపించడంతో ఆ గది వద్దకు తాను, తన భార్య కరీన్ కపూర్ పరుగెత్తామని వివరించారు.
Saif Ali Khan: గత వారం ముంబైలోని సంపన్నులు ఉండే బాంద్రాలో ఉన తన నివాసంలో చోటు చేసుకున్న కత్తిపోట్ల ఘటనకు సంబంధించి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు గురువారం రికార్డు చేశారు. జనవరి 16 రాత్రి జరిగిన సంఘటనను సైఫ్ అలీఖాన్ వివరించారు.

పిల్లల గదిలో నుంచి అరుపులు..
పిల్లల గదిలో నుంచి అరుపులు వినిపించడంతో తాను, తన భార్య కరీన్ కపూర్ ఆ గది వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లామని సైఫ్ అలీఖాన్ (saif ali khan) పోలీసులకు తెలిపాడు. తాను, కరీనాకపూర్ 11వ అంతస్తులోని తమ పడకగదిలో ఉండగా.. తమ పిల్లలను చూసుకునే ఆయా ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని సైఫ్ పోలీసులకు వివరించారు. ఎలియామా ఫిలిప్ కూడా తన పిల్లలతో పాటు అదే గదిలో ఉంటుందని, దుండగుడు ఆ గదిలోకి ప్రవేశించడంతో భయపడి ఆమె కేకలు పెట్టిందని వివరించారు.
రూ. 1 కోటి డిమాండ్
పిల్లల గదిలోకి ప్రవేశించిన దుండగుడు తమ చిన్న కుమారుడు జహంగీర్ (జెహ్) వద్దకు వెళ్తుండగా ఆయా ఎలియామా ఫిలిప్ అతడిని అడ్డుకుని కేకలు పెట్టిందని సైఫ్ వివరించాడు. ఆ దుండగుడు రూ. 1 కోటి ఇవ్వాలని ఎలియామా ఫిలిప్ ను డిమాండ్ చేశాడని, ఈ లోపు తాను ఆ గదిలోకి వెళ్లి ఆ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించానని వివరించాడు. ఆ క్రమంలో అతడు తనను వీపు, మెడ, చేతులపై కత్తితో పొడిచి పారిపోయాడని సైఫ్ అలీఖాన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించాడు.
నిందితుడు బంగ్లాదేశీ
సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గా ముంబై పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. అతడు యాదృచ్ఛికంగా సైఫ్ ఇంటిని ఎంచుకున్నాడని, ఆ ఇల్లు సైఫ్ ది అని అతడికి తెలియదని పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ్ సంహిత (BNS) లోని 311, 312, 331 (4), 331 (6), 331 (7) సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.