Saif Ali Khan case : సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో నిందితుడి పక్షాన వాదించేందుకు గొడవపడ్డ లాయర్లు..!-saif ali khan case drama at court as 2 lawyers jostle to represent accused ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Saif Ali Khan Case : సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో నిందితుడి పక్షాన వాదించేందుకు గొడవపడ్డ లాయర్లు..!

Saif Ali Khan case : సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో నిందితుడి పక్షాన వాదించేందుకు గొడవపడ్డ లాయర్లు..!

Sharath Chitturi HT Telugu

Saif Ali Khan attacker lawyers : సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసు నిందితుడి పక్షాన వాదించేందుకు ఇద్దరు లాయర్లు గొడవపడ్డారు! కోర్టులో అసలేం జరిగిందంటే..

కోర్టులో సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసు నిందితుడు (AP)

ముంబై బాంద్రా కోర్టులో ఆదివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి! బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసు నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా, అతని పక్షాన వాదించేందుకు ఇద్దరు న్యాయవాదులు గొడవపడ్డారు.

ఇదీ జరిగింది..

బాంద్రా అపార్ట్​మెంట్​లోకి జనవరి 16 తెల్లవారుజామున చొరబడి సైఫ్ అలీఖాన్​పై పదేపదే కత్తితో దాడి చేసిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్​ని ముంబై పోలీసులు ఆదివారం ఉదయం థానేలో అరెస్ట్​ చేశారు. బంగ్లాదేశీ జాతీయుడిగా పోలీసులు అనుమానిస్తున్న షెహజాద్​ను ఆదివారం మధ్యాహ్నం బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించగా షెహజాద్ లేదని సమాధానమిచ్చాడు. అనంతరం కోర్టు వెనుక భాగంలో నిందితుల కోసం ఏర్పాటు చేసిన బాక్స్ వద్దకు నిందితుడిని తీసుకెళ్లారు.

అనంతరం షెహజాద్ తరఫున వాదిస్తున్నట్లు ఒక న్యాయవాది ముందుకు వచ్చారు. అయితే, 'వాకలతామన' (ఒక కేసులో వాదించడానికి న్యాయవాదికి అధికారం ఇచ్చే చట్టపరమైన పత్రం) పై నిందితుడి సంతకం తీసుకునే లోపే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

వెనుక నుంచి మరో లాయర్ నిందితుడి బాక్స్ వద్దకు హడావుడిగా వెళ్లి షెహజాద్ సంతకాన్ని తన వాకలతమానాపై తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దాడికి పాల్పడిన వ్యక్తి తరఫున ఎవరు హాజరవుతారనే దానిపై ఇద్దరు కొంతసేపు గొడవపడ్డారు.

అయితే, సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసు నిందితుడి పక్షాన ఇద్దరూ వాదించమని మెటిస్ట్రేట్​ సూచించారు.

"మీరిద్దరూ హాజరుకావచ్చు," అని మేజిస్ట్రేట్ చెప్పడంతో న్యాయవాదులు అంగీకరించారు. అలా గొడవ సద్దుమణిగింది.

అనంతరం కోర్టు షెహజాద్​కు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది.

సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు..

జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని 'సద్గురు శరణ్' భవనంలోని 12వ అంతస్తు అపార్ట్​మెంట్​లో సైఫ్ అలీ ఖాన్​ని ఓ దుండగుడు కత్తితో పొడిచాడు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో 54 ఏళ్ల నటుడికి లీలావతి ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. సైఫ్​ అలీ ఖాన్ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ కావచ్చని వైద్యులు తెలిపారు.

అయితే సైఫ్​పై దాడి కేసు నిందితుడిని అరెస్టు చేయడానికి ముందు, నటుడి భవనంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతనిని పోలిన కనీసం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ వారెవరూ నేరం చేయలేదని తేలడంతో విడిచిపెట్టారు. చివరికి అసలు నిందితుడు షెహజాద్​ చిక్కాడు.

దక్షిణ బంగ్లాదేశ్​ బరిసాల్ డివిజన్​లోని ఝలకతి అని కూడా పిలిచే ఝలోకతికి చెందిన షెహజాద్ గత ఐదు నెలలుగా ముంబైలో ఉన్నాడని, ఈ సమయంలో అతను హౌస్ కీపింగ్ ఏజెన్సీతో పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.