Saif Ali Khan stabbing : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతనే! ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు..
Saif Ali Khan stabbing case : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ప్రధాన నిందుతుడు విజయ్ దాస్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. థానే జిల్లాలో అతను పోలీసులకు చిక్కాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి, ఆయనపై దాడి చేసిన వ్యక్తి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు! గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరగ్గా.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు విజయ్ దాస్‌ని ముంబై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని థానే జిల్లాలో అరెస్టు చేశారు.
అరెస్టయిన నిందితుడు విజయ్ దాస్ ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తూ ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడిని అతను అంగీకరించాడని తెలిపారు.
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఆదివారం ఉదయం 9 గంటలకు డీసీపీ జోన్ 9 కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అప్పుడు మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. నిందితుడు అసలు ఎందుకు ఈ నేరానికి పాల్పడ్డాడు? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా సైఫ్ అలీ ఖాన్ కేసు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
వరుస విచారణలు, గాలింపు చర్యలు..
అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం నుంచి పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ వచ్చారు. చివరిగా.. శనివారం రాత్రి ఓ వ్యక్తిని ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వే స్టేషన్లో పట్టుకుని విచారించారు. అయితే అదుపులోకి తీసుకున్న వారెవరూ సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడలేదని తేలింది.
నిందితుడిని పట్టుకునేందుకు 3 రోజులుగా 30కిపైగా టీమ్స్ తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున ప్రాంతంలో ప్రధాన నిందితుడు విజయ్ దాస్ పోలీసులకు దొరికాడు.
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు..
గురువారం తెల్లవారుజామున పలుమార్లు కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముంబై బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని 'సద్గురు శరణ్' భవనంలోని తన 12వ అంతస్తు అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ కుమరుడు, పనిమనిషిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేయబోయాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్‌పై దాడి జరగడంతో ఘర్షణకు దారితీసింది. చివరికి సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురయ్యారు.
వెన్నెముకకు కత్తిపోట్లు సహా తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ముంబైలోని లీలావతి ఆసుపత్రికి సైఫ్‌ని తరలించారు. సైఫ్ వెన్నెముకలో ఉన్న కత్తి కారణంగా థొరాసిక్ వెన్నెముకకు తీవ్ర గాయమైందని వైద్యులు తెలిపారు.
సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 2.5 ఇంచ్ పొడవైన బ్లేడ్‌ని తొలగించే శస్త్రచికిత్స విజయవంతమైందని, సైఫ్ ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ, వైద్య సిబ్బంది ఆయన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
ఐసీయూ నుంచి తరలించిన ఈ బాలీవుడ్ నటుడు నడవగలుగుతున్నాడని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. సోమవారం నాటికి సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
సంబంధిత కథనం