Saif Ali Khan : “బంగ్లాదేశ్ నుంచి వచ్చి..” సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో అసలు నిజాలు చెప్పిన పోలీసులు
Saif Ali Khan stabbing case : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడికి సంబంధించిన కీలక వివరాలను పోలీసులు వెల్లడించారు. అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చాడని, పేరు మార్చుకుని ఇండియాలో తిరుగుతున్నాడని తెలిపారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసును ముంబై పోలీసులు ఛేదించారు. గత గురువారం తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి చొరబడి, ఆయనపై దాడి చేసిన వ్యక్తిని.. థానే వెస్ట్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు బంగ్లాదేశ్ దేశస్తుడని, కానీ మారు పేరుతో ఇండియాలో తిరుగుతున్నాడని వివరించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు- నిందితుడు ఎవరు?
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి పేరు విజయ్ దాస్ అని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అతని అసలు పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకున్నాడని స్పష్టం చేశారు.
మహ్మద్ షెహజాద్ వయస్సు 30 ఏళ్లని, దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని జోన్ 9 డీసీపీ దీక్షిత్ గెడం తెలిపారు.
“బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించిన తర్వాత విజయ్ దాస్ అనే పేరును నిందితుడు వాడుకుంటున్నాడు. ఐదారు నెలల క్రితం ముంబైకి వచ్చాడు. కొన్ని రోజులు ముంబైలో, ఆ తర్వాత ముంబై పరిసర ప్రాంతాల్లో బస చేశాడు. నిందితుడు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో సైతం పనిచేశాడు,” అని గెడం తెలిపారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరుతామని గెడం వెల్లడించారు. నిందితుడి వద్ద సరైన భారతీయ పత్రాలు లేవని, కాగా అతను బంగ్లాదేశీయుడని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
నిందితుడు విజయ్ దాస్, బిజోయ్ దాస్ వంటి బహుళ మారుపేర్లను ఉపయోగించాడని ముంబై పోలీసులు ఇంతకు ముందు తెలిపారు.
ముంబై బాంద్రా ప్రాంతంలో 'సద్గురు శరణ్' భవనంలోని 12వ అంతస్తులో విలాసవంతమైన అపార్ట్మెంట్లో దొంగతనం చేసేందుకు నిందితుడు చొరబడి, సైఫ్ అలీ ఖాన్‌ను పలుమార్లు కత్తితో పొడిచాడు.
ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య, తోటి నటి కరీనా కపూర్, వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల జెహ్, ఎనిమిదేళ్ల తైమూర్ తమ ఐదుగురు ఇంటి సహాయకులతో కలిసి ఇంట్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరు కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్‌ను నగరంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర శస్త్రచికిత్స చేశారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు వెల్లడించారు.
సంబంధిత కథనం