Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంలో బయటపడిన కుట్ర కోణం!; అందుకే సీబీఐ దర్యాప్తు-sabotage why railways sought cbi probe into three train collision in odisha ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో బయటపడిన కుట్ర కోణం!; అందుకే సీబీఐ దర్యాప్తు

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంలో బయటపడిన కుట్ర కోణం!; అందుకే సీబీఐ దర్యాప్తు

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 07:13 PM IST

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభించడం వల్లనే సీబీఐ దర్యాప్తును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారని రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయ చర్యల దృశ్యం (ఫైల్ ఫొటో)
రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయ చర్యల దృశ్యం (ఫైల్ ఫొటో)

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని భావించడానికి వీలుగా ప్రాథమిక ఆధారాలు లభించడం వల్లనే సీబీఐ దర్యాప్తును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారని రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఘోర రైలు ప్రమాదం

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలు ను ఢీకొని పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎదురుగా వస్తున్న యశ్వంత్ పూర్ - హౌరా ఎక్స్ ప్రెస్ ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీకొనడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై వెంటనే శాఖాపరమైన దర్యాప్తులో భాగంగా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (Commissioner of Railway Safety CRS) విచారణ ప్రారంభించారు.

కీలక అంశాలు వెల్లడి..

కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ - సీఆర్ఎస్ (Commissioner of Railway Safety CRS) జరిపిన దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయని, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో కావాలనే మార్పులు చేసినట్లుగా గుర్తించారని రైల్వే వర్గాలు వెల్లడించాయి. సీఆర్ఎస్ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా.. మరింత లోతైన దర్యాప్తు అవసరమన్న నిర్ణయానికి వచ్చారని, అందుకు సీబీఐ వంటి ప్రొఫెషనల్ ఏజెన్సీనే సరైనదనే నిర్ణయానికి వచ్చారని పేరు చెప్పడానికి ఇష్టపడని రైల్వే ఉన్నతాధికారి ఒకరు పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో చేసిన మార్పు కారణంగానే మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. లూప్ లైన్ లోకి వెళ్లి గూడ్స్ రైలును ఢీకొన్నదని వివరించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో ఎవరు, ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందనేది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. ‘ఎవరైనా కావాలని చేస్తే తప్ప.. మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కు వెళ్లేలా అలా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో మార్పు జరగదు’ అని స్పష్టం చేశారు.

అసలు కారణం తెలిసింది..

ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం తెలిసిందని, అందుకు కారణమైన క్రిమినల్స్ ఎవరో కూడా తెలిసిందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఆదివారం సంచలన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును కోరినట్లు తెలుస్తోంది.

Whats_app_banner