Sabarmati Express : పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. భారీ బండరాయి తగిలి!
Sabarmati Express derailed : యూపీ కాన్పూర్ రైల్వే స్టేషన్‌కి సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. భారీ బండరాయి ఇంజిన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది.
దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. యూపీలోని కాన్పూర్ స్టేషన్‌కి సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో అనేక బోగీలు పట్టాలు తప్పాయి. అయితే తాజా రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కానీ ఆ ప్రాంతంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్- భీమ్సేన్ స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్‌లో శనివారం తెల్లవారుజామున 19168 నంబరు గల సబర్మతి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
రైల్వే ట్రైన్ ఎంక్వైరీ వెబ్సైట్ ప్రకారం.. భీమ్సేన్ సమీపంలోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత, తెల్లవారుజామున 2:32 గంటలకు రైలు పట్టాలు తప్పింది.
మరోవైపు కాన్పూర్‌కు ప్రయాణికులను తరలించేందుకు వీలుగా భారతీయ రైల్వే బస్సులను ఇప్పటికే ఘటనాస్థలానికి పంపించింది. బస్సుల ద్వారా సబర్మతీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను కాన్పూర్‌కి తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా గమ్యస్థానానికి చేరుస్తామని అధికారులు వెల్లడించారు.
సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు యూపీ వారణాసి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వరకు సేవలను అందిస్తుంది.
మరోవైపు అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు సైతం ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రయాణికుల్లో ఎవరికీ గాయాలు అవ్వలేదని నిర్థరించారు.
ప్రమాదం ఎలా జరిగింది..?
డ్రైవర్ ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక బండరాయి ఇంజిన్‌ను బలంగా తాకిందని. ఇది ఇంజిన్ క్యాటిల్ గార్డుకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది. అనంతరం సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలి తప్పాయి.
ఈ ఘటనపై భారతీయ రైల్వే దర్యాప్తు చేస్తోంది.
సంబంధిత స్టేషన్లకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను అధికారులు జారీ చేశారు:
1. PRYJ: 0532-2408128, 0532-2407353, 0532-2408149 CNB: 0512-2323018, 0512-2323016, 0512-2323015
2. MZP: 0544-2220097
3. FTP: 7392964622
4. NYN: 0532-2697252
5. CAR: 8840377893
6. ETW: 7525001249
7. HRS/ASM: 7525001336
8. PHD: 7505720185
దేశంలో ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. దేశంలోని ఏదో ఒక మూల రైలు పట్టాలు తప్పిన ఘటనలు నిత్యం వార్తల్లో నిలిచి, ప్రజలను భయపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఝార్ఖండ్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌కి చెందిన 18 బోగీలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. అంతకుముందు జూన్‌లో పశ్చిమ్‌బెంగాల్‌లో ఓ గూడ్స్ రైలు- కాంచన్‌జంగ ప్యాసింజర్ రైలు పరస్పరం ఢీకొన్నాయి.ఈ రైలు ప్రమాదంలో 11మంది మరణించారు. మరో 60మంది ప్రయాణికులు గాయపడ్డారు.
రైలు ప్రయాణం ఇక ఏమాత్రం సురక్షితం కాదన్న అభిప్రాయాలు ప్రజల నుంచి వెలువడుతోంది. రైలు ప్రమాదాలు జరగకుండా మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం