ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ మెుదట ప్రయత్నిస్తుంది.. కానీ అక్కడ ఈ సమస్య : ఎస్ జైశంకర్
S Jaishankar : ఎల్ఏసీ వద్ద భారత్, చైనా దళాల ఉపసంహరణపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఈ చర్యతో మరింత ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా దళాల ఉపసంహరణపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఈ చర్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలతోపాటుగా ఇతర మార్గాలను కూడా ఉపయోగకరం అన్నారు. ఆస్ట్రేలియా నగరమైన బ్రిస్బేన్‌లో భారతీయ కమ్యూనిటీతో జరిగిన ముఖాముఖిలో జైశంకర్ ఐరోపా, పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం గురించి మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని దౌత్యం ద్వారా అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు. ప్రయత్నంలో మరిన్ని దేశాలు ముందుకు రావాలని, ఎందుకంటే యుద్ధం ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా మంచిది కాదన్నారు.
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల విస్తృత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని జైశంకర్ అన్నారు. ఈ యుద్ధాన్ని అంతమొందించేందుకు వివిధ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యామని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుత పరిష్కారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ జూలైలో రష్యా, ఆగస్టులో ఉక్రెయిన్ లో పర్యటించారని జైశంకర్ గుర్తు చేశారు.
ఇరువురు నేతలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారని చెప్పారు జైశంకర్. 'ఈ యుద్ధాన్ని ఆపడానికి మిగతా ప్రపంచ దేశాలు కూడా ముందుకు రావాలని మేము భావిస్తున్నాం. అలా జరగదని చేతులు ఎత్తేయకూడదు. ప్రపంచమంతా ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఆపాలి. భారతదేశం ఏదైనా చేయగలదని మిగిలిన ప్రపంచం అనుమానించిందని, కానీ నేడు ఆ దేశాల మధ్య, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మధ్య ఒక అవగాహన ఉంది.' అని జైశంకర్ అన్నారు.
ఇజ్రాయెల్‌తో హమాస్, ఇరాన్, లెబనాన్ యుద్ధంపై జైశంకర్ మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితి భిన్నంగా ఉందని, ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఆపడంపై దృష్టి సారించామని చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్‌లు నేరుగా పరస్పరం సంభాషించుకోలేకపోవడం ఇక్కడ అతిపెద్ద లోపాలలో ఒకటని తెలిపారు. వారు ఆ అంతరాన్ని తగ్గించినా లేదా తొలగించినా యుద్ధాన్ని ఆపడానికి మేం మొదట ప్రయత్నిస్తామని జైశంకర్ స్పష్టం చేశారు.
ఎల్ఏసీపై ఒప్పందాలు మరిన్ని మార్గాలను తెరుస్తాయని, ఎల్ఏసీలో చైనా దళాల ఉపసంహరణ పరస్పర సంబంధాల్లో కొంత పురోగతి సాధించిందని జైశంకర్ అన్నారు. ఇప్పుడు సైన్యాలు వెనక్కు తగ్గిన తర్వాత మనం ఏ దిశలో వెళతామో చూడాలని చెప్పారు. ఈ ఉపసంహరణ స్వాగతించదగిన చర్య అని మేం నమ్ముతున్నామన్నారు.
ఎల్ఏసీ వెంబడి పెద్ద సంఖ్యలో మోహరించిన చైనా సైనికులు 2020కి ముందు అక్కడ లేరని జైశంకర్ గుర్తు చేశారు. వివాదం సమయంలో ఎల్ఏసీలోని లడఖ్ సెక్టార్‌లో భారతదేశం, చైనా 50,000 మందికి పైగా సైనికులను మోహరించాయి. చైనా యాప్‌లను నిషేధించడం, చైనా పౌరులకు వీసాలను పరిమితం చేయడం, చైనా వైపు నుంచి పెట్టుబడులను పరిమితం చేయడం, తగ్గించడం సహా చైనాకు వ్యతిరేకంగా భారత్ అనేక ఇతర కఠిన చర్యలు తీసుకుంది.