Russia Ukraine Crisis | ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే మన జేబుకు చిల్లేనా?-russia and ukraine crisis may increase prices in india say experts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Russia And Ukraine Crisis May Increase Prices In India Say Experts

Russia Ukraine Crisis | ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే మన జేబుకు చిల్లేనా?

Hari Prasad S HT Telugu
Feb 23, 2022 11:19 AM IST

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మన ఇండియాలోని మార్కెట్లు వణికిపోతాయి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల సమయంలోనూ అదే జరుగుతోంది. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మన జేబుకు చిల్లు పెడుతుందనీ ఎక్స్‌పర్ట్స్‌ స్పష్టం చేస్తున్నారు.

కీవ్ లోని రష్యన్ ఎంబసీ ముందు పుతిన్ ను ఆపాలంటూ ఉక్రెనియన్ల ప్రదర్శన
కీవ్ లోని రష్యన్ ఎంబసీ ముందు పుతిన్ ను ఆపాలంటూ ఉక్రెనియన్ల ప్రదర్శన (REUTERS)

న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా మన స్టాక్‌ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు నమోదవుతున్న సంగతి తెలుసు కదా. అక్కడ ఉక్రెయిన్‌పై రష్యా ఎక్కడ దాడి చేస్తోందో అని ఇక్కడ మన ఇన్వెస్టర్లు వణికిపోతున్నారు. అక్కడ యుద్ధానికి, ఇక్కడ మార్కెట్లకు ఏంటి సంబంధం అని తీసిపారేయడానికి లేదు. 

ట్రెండింగ్ వార్తలు

గ్లోబలైజేషన్‌ పుణ్యమాని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా.. అన్ని దేశాల్లోని మార్కెట్లు వణికిపోతున్నాయి. అంతేకాదు ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనా, సంక్షోభం ఇలాగే కొనసాగినా.. ఇండియాలోని మధ్యతరగతి జీవి జేబుకు చిల్లు పడటమూ ఖాయమంటున్నారు నిపుణులు. ఈ ఉద్రిక్తతల వల్ల ఎన్నో నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది.

పెరగనున్న పెట్రోలియం ఉత్పత్తుల ధర

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు క్రూడాయిల్‌ ధరను భారీగా పెంచేశాయి. బ్యారెల్‌ ధర 2014 తర్వాత అత్యధికంగా 96.7 డాలర్లకు చేరింది. ప్రపంచంలో క్రూడాయిల్ భారీగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి. దీంతో ప్రస్తుత ఉద్రిక్తతలు క్రూడాయిల్ ధరలను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఇది 100 డాలర్లు దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. 

దీంతో క్రూడాయిల్‌ సంబంధిత ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. ఫలితంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలతోపాటు ఎల్పీజీ, సీఎన్జీ, కిరోసిన్‌ వంటి ధరలూ పెరుగుతాయి. ఇప్పటికే 2021లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మన దేశంలో ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా చాలా రోజులుగా వీటి ధరలు పెంచలేదు. 

ఇప్పుడు ఆ ఎన్నికలు కూడా ముగియడానికి దగ్గర్లో ఉన్నాయి. వీటికితోడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఇక పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతాయి. దేశ చమురు అవసరాల్లో 80 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతోంది. దీంతో బయట క్రూడాయిల్‌ ధర పెరిగితే అది ఆటోమేటిగ్గా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రభావం చూపుతుంది. చమురు ధర పెరిగితే దిగుమతుల భారం పెరిగి కరెంట్‌ అకౌంట్‌ లోటుపై కూడా ప్రభావంపై చూపుతుంది.

ఆహార ద్రవ్యోల్బణం పెరగొచ్చు

ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. ఇండియా కూడా దీనికి అతీతమేమీ కాదు. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నల్ల సముద్రం ద్వారా ఆహార ధాన్యాల సరఫరా దెబ్బ తింటే అది ఆహార ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

పైగా ప్రపంచంలో గోధుమల ఎగుమతుల్లో 25 శాతం వాటా రష్యా, ఉక్రెయిన్‌లదే. ఇప్పుడున్న ఉద్రిక్తతలు గోధుమల ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఇండియా ప్రతి ఏటా 16.5 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంటుండగా.. ఇందులో ఎక్కువ శాతం రష్యా, ఉక్రెయిన్‌ల నుంచే కావడం గమనార్హం. దీని కారణంగా మన దేశంలో గోధుమల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం