RSS three-day annual meet: సామాజిక సమస్యలపై చర్చించేందుకు ఆర్ఎస్ఎస్ మీటింగ్-rss begins 3 day annual meet in raipur to discuss social issues ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rss Begins 3 Day Annual Meet In Raipur To Discuss Social Issues

RSS three-day annual meet: సామాజిక సమస్యలపై చర్చించేందుకు ఆర్ఎస్ఎస్ మీటింగ్

HT Telugu Desk HT Telugu
Sep 11, 2022 07:37 AM IST

RSS begins three-day annual meet: సామాజిక సమస్యలపై చర్చించేందుకు మూడు రోజుల పాటు జరిగే ఆర్‌ఎస్‌ఎస్ వార్షిక సమావేశం ప్రారంభమైంది.

రాయ్‌పూర్‌లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడు రోజుల సమావేశం
రాయ్‌పూర్‌లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడు రోజుల సమావేశం

భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం రాయ్‌పూర్‌‌లో ప్రారంభమైంది. మత మార్పిడులు సహా వివిధ సామాజిక సమస్యలను చర్చించడానికి ఛత్తీస్‌గఢ్ రాజధానిలో శనివారం తమ మూడు రోజుల వార్షిక జాతీయ సమన్వయ సమావేశాన్ని (అఖిల్ భారతీయ సమన్వయ్ బైఠక్) ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

జైనం మానస్ భవన్‌లో ప్రారంభమైన ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

బీజేపీ, విశ్వహిందూ పరిషత్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో సహా ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రేరణ పొందిన లేదా దానితో అనుబంధం ఉన్న 36 సంఘాలకు చెందిన దాదాపు 240 మంది ఆఫీస్ బేరర్లు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొంటున్నారు.

‘అనేక ఇతర సమస్యలతో పాటు, సమన్వయ్ బైఠక్ ప్రధాన అంశం మత మార్పిడి, అలాగే సంస్థాగత విస్తరణ, దాని విభాగాల విస్తరణ’ అని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త తెలిపారు.

మొత్తం 36 సంస్థలు సామాజిక కారణాలు, జాతీయవాదం కోసం పనిచేస్తున్నాయని, వారు తమ అనుభవాలను పంచుకుంటారని, గత సంవత్సర కాలంలో తమ పని తీరు, విజయాలను చర్చిస్తారని ఆర్ఎస్ఎస్ ప్రధాన జాతీయ ప్రతినిధి సునీల్ అంబేకర్ చెప్పారు.

ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని 2025 నాటికి తన శాఖల నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించాలని చూస్తోంది.

‘మా వద్ద 60,000 కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. 2025 నాటికి 1 లక్షకు పైగా శాఖలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని ఓ కార్యకర్త చెప్పారు. ‘ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. 2025 నాటికి బీజేపీ అధికారంలోకి రావడానికి సహాయపడే వ్యూహం కూడా ఒక ఎజెండా..’ అని వివరించారు.

ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల జాతీయ సమన్వయ సమావేశం ఛత్తీస్‌గఢ్‌లో జరగడం ఇదే తొలిసారి. రాయ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఈ సమావేశాన్ని వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. రాబోయే ఎన్నికల కోసం సంస్థ తన బలాన్ని పెంచుకోవాలనుకుంటోంది. 2018లో రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడింది.

బీజేపీకి 2023 అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమైనవి, పార్టీ రాష్ట్రంలో తన రెండో శ్రేణి నాయకత్వంపై దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత 3.5 సంవత్సరాలలో కాంగ్రెస్ రాష్ట్రంలో ఉప జాతీయవాద సమస్యను లేవనెత్తింది కాబట్టి, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ రాబోయే రాష్ట్ర ఎన్నికలలో ప్రధాన అజెండాగా మత మార్పిడిపై దృష్టి సారిస్తోంది.

‘ఛత్తీస్‌గఢ్‌లో మతమార్పిడి అతిపెద్ద సమస్య. దీనిని సమావేశంలో చర్చించాల్సి ఉంది..’ అని బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు. ‘రెండోది.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున, సంస్థ క్షేత్రస్థాయిలో పనిచేయడంపై దృష్టిపెడుతోంది..’ అని తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్