వాటికన్ లోని కార్డినల్స్ గురువారం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ ను కొత్త పోప్ గా ఎన్నుకున్నారు. పోప్ గా ఎన్నికైన అనంతరం అతడు 14వ లియో XIV (Leo XIV) అనే పేరును పొందాడు. లియో XIV చరిత్రలో మొదటి అమెరికన్ పోప్ గా నిలిచాడు.
కొత్త పోప్ ఎన్నిక ముగిసినట్లు గురువారం సింబాలిక్ గా చూపే తెల్లని పొగ సెయింట్ పీటర్స్ బాసిలికా సిస్టిన్ చాపెల్ చిమ్నీ నుంచి వచ్చింది. ఫ్రెంచ్ కార్డినల్ డొమినిక్ మాంబెర్టీ కొత్త పోప్ వివరాలను ప్రకటించారు. లాటిన్ పదాలతో "హాబెమస్ పాపం" (మాకు ఒక పోప్ ఉన్నారు) అని ఫ్రెంచ్ కార్డినల్ డొమినిక్ మాంబెర్టీ ప్రకటించారు. మొదటి లాటిన్ అమెరికన్ పోప్, 12 సంవత్సరాలు చర్చికి నాయకత్వం వహించిన పోప్ ఫ్రాన్సిస్ గత నెలలో మరణించిన తరువాత 267 వ కాథలిక్ పోప్ గా లియో 14 గురువారం ఎన్నికయ్యారు.
ఫ్రెంచ్, ఇటాలియన్ సంతతికి చెందిన 69 ఏళ్ల అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ 1955 సెప్టెంబర్ 14న చికాగోలో జన్మించారు. 2023 నుంచి బిషప్స్ కోసం డికాస్టెరీ ప్రిఫెక్ట్గా, లాటిన్ అమెరికా పాంటిఫికల్ కమిషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆర్డర్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ సభ్యుడైన ప్రెవోస్ట్ పెరూలో మిషనరీగా దశాబ్దాలు గడిపారు. అగస్టీనియన్ల పూర్వ జనరల్ గా (2001–2013) పనిచేశారు. పెరూలోని చిక్లాయో బిషప్ (2015–2023) గా పనిచేశారు. 2023లో కార్డినల్ గా, 2025లో కార్డినల్ బిషప్ గా పదోన్నతి పొందారు. మేధోపరమైన రచనలు, సామాజిక బోధనలకు ఆయన ప్రసిద్ధి చెందారు.
కొత్త పోప్ గా ఎన్నికైన తరువాత సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద గుమిగూడిన ప్రేక్షకులకు పోప్ లియో 14 "Peace be with all you" అని ఆశీర్వదించారు. "దేవుని కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మంచి కాపరి పునరుత్థాన క్రీస్తు యొక్క మొదటి పలకరి ఇది" అని ఆయన తన మాటల వెనుక ఉన్న అర్థాన్ని వివరిస్తూ చెప్పారు. "ఈ శాంతి పలకరింపు మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి ప్రవేశించాలని నేను కూడా కోరుకుంటున్నాను." అన్నారు.
తన కన్నా ముందు పోప్ గా సేవలు అందించిన పోప్ ఫ్రాన్సిస్ కు పోప్ లియో 14 భావోద్వేగ నివాళి అర్పించారు. 'రోమ్ ను ఆశీర్వదించే పోప్ ఫ్రాన్సిస్ స్వరాన్ని మన గుర్తుంచుకుందాం. రోమ్ ను ఆశీర్వదించిన పోప్ ఆ రోజు ఉదయం యావత్ ప్రపంచానికి తన ఆశీర్వాదం ఇచ్చారు. ఆ ఆశీర్వాదాన్ని అనుసరించడానికి నన్ను అనుమతించండి. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. చెడు రాజ్యమేలదు' అని పోప్ లియో అన్నారు.
పోప్ గా ఎన్నికైన ప్రీవోస్ట్ కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. 'పోప్ గా నియమితులైన కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ కు అభినందనలు. ఆయన తొలి అమెరికన్ పోప్ కావడం గౌరవంగా భావిస్తున్నా. ఎంత ఉత్సాహం, ఎంత గొప్ప గౌరవం మన దేశానికి. పోప్ 14వ లియోను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది చాలా అర్థవంతమైన క్షణం' అని 78 ఏళ్ల ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సంబంధిత కథనం