ాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఇది మాత్రమే కాదు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కుటుంబం నుండి కూడా బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. లాలూ ప్రసాద్ నిర్ణయం వల్ల పార్టీలోనూ, కుటుంబంలోనూ కొత్త గొడవ మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు పాటించడం లేదని బహిష్కరిస్తున్నట్టుగా లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు.
తేజ్ ప్రతాప్ బహిష్కరణ ఆర్జేడీకి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా ప్రతిపక్షాలకు కలిసి వస్తుందా రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుస్తుంది. దీనికి ముందు కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ కుటుంబానికి, పార్టీకి మరియు లాలూ ప్రసాద్ యాదవ్ కు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాడు.
బీహార్ రాజకీయాల్లో ఎప్పుడూ ముఖ్యాంశాల్లో ఉండే తేజ్ ప్రతాప్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు. ఆయన తన ప్రత్యేకమైన శైలితో తరచుగా వార్తల్లో నిలుస్తారు. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు 2015లో మహువా అసెంబ్లీ స్థానం నుండి గెలిచారు. ఆ తర్వాత నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. దీని తరువాత నితీష్ కుమార్‌తో మళ్ళీ పొత్తు ఏర్పడినప్పుడు తేజ్ ప్రతాప్‌ను పర్యావరణం, అటవీ మంత్రిగా నియమించారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యక్తిగత జీవితం కూడా అంతగా బాగాలేదు. తేజ్ ప్రతాప్ యాదవ్ 2018లో బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. తరువాత విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయం ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. అనుష్క యాదవ్ తో ఉన్న వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మళ్లీ వార్తల్లో నిలిచాడు.
ఈ అనుష్క యాదవ్ గురించి తేజ్ ప్రతాప్ చెప్పగానే విషయం బయటకు వచ్చింది. శనివారం రాత్రి తన ఫేస్‌బుక్ ఖాతాలో మహిళతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు తేజ్ ప్రతాప్. 'ఈ ఫొటోలో మీరు చూస్తున్న ఆమె అనుష్క యాదవ్. 12 ఏళ్లుగా మేం ప్రేమించుకుంటున్నాం. సంబంధంలో ఉన్నాం.' అని తేజ్ ప్రతాప్ యాదవ్ పోస్ట్ చేశారు. దీంతో వెంటనే ఇది వైరల్ అయింది.
అయితే తర్వాత తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించారు. కానీ అప్పటికే పెద్దాయన లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. కొడుకును పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు.
'వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు పాటించకపోవడం సామాజిక న్యాయం కోసం మనం చేస్తున్న సామూహిక పోరాటాన్ని బలహీనం చేస్తుంది. నా పెద్ద కుమారుడి కార్యకలాపాలు, ప్రవర్తన, బాధ్యతాహారిత్యం కుటుంబం విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందుకే పార్టీ, కుటుంబం నుంచి తొలగిస్తున్నాను. ఆరు ఏళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను.' అని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు.