IAS Shah Faesal: పాకిస్తాన్‌లో అలా కాదు.. ముస్లిం ఐఏఎస్ అధికారి ట్వీట్ వైరల్
IAS officer Shah Faesal: ముస్లింలు ఇస్లాం దేశంలో కూడా ఊహించని స్వేచ్ఛను భారత్‌లో అనుభవిస్తున్నారని ఐఏఎస్ అధికారి షా ఫజల్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.
ఐఏఎస్ అధికారి షా ఫైజల్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ‘యూకే ప్రధాన మంత్రిగా రిషి సునాక్ ఎన్నిక పాకిస్తాన్‌కు ఆశ్చర్యం కలిగించవచ్చు. అక్కడ మైనారిటీలు ప్రభుత్వంలో అత్యున్నతస్థాయి పదవులను అందుకోలేరు. భారతదేశం ప్రజాస్వామ్యంలో అలాకాదు..’ అని ట్వీట్ చేశారు. రిషి సునాక్ ఎన్నిక అనంతరం ఓవైపు బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ట్విటర్ వార్ నడుస్తున్న సమయంలోనే ఐఏఎస్ అధికారి ట్వీట్ వెలువడింది. కాంగ్రెస్ నేతలు పి.చిదంబరం, శశిథరూర్ బీజేపీ మెజారిటీ వాదాన్ని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో కేవలం మెజారిటీ వర్గాలకే అత్యున్నత పదవులు వస్తున్నాయని, మైనారిటీ వర్గాలకు లేవన్న కోణంలో వారు ప్రశ్నించారు. అయితే బీజేపీ నేతలు మన్‌మోహన్ సింగ్, అబ్దుల్ కలామ్, ద్రౌపది ముర్ములను ప్రస్తావించారు.
పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఐఏఎస్ అధికారి షా ఫజల్ మాట్లాడుతూ భారతీయ ముస్లింలు ఇస్లాం దేశాల్లో కూడా ఊహించలేని స్వేచ్ఛను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భారతదేశాన్ని పొగిడారు. ఇది కేవలం ఒక్క భారత దేశంలోనే సాధ్యమవుతుందని, ఒక ముస్లిం యువకుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలడని పేర్కొన్నారు.
షా ఫజల్ 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జమ్మూకశ్మీర్ క్యాడర్ టాపర్. 2019లో ఆయన తన సర్వీసు నుంచి వైదొలగి సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. 2022లో తిరిగి కేంద్ర పర్యాటక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు.
‘కశ్మీర్ నుంచి ఒక ముస్లిం యువకుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణుడవడం ఒక భారతదేశంలోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వంలో ఉన్నతస్థాయికి ఎదగడం, ప్రభుత్వంతో విభేదించినా.. తిరిగి ప్రభుత్వమే సర్వీసులోకి తీసుకోవడం ఇక్కడే సాధ్యమవుతుంది..’ అని షా ఫజల్ ట్వీట్లు చేశారు.
‘నా జీవిత ప్రయాణమే ఇందుకు ఉదాహరణ. 130 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ప్రతి పౌరుడి నుంచి నేను గౌరవం పొందాను. ప్రోత్సాహం పొందాను. సొంతవాడిగా గౌరవించారు. ప్రతి అడుగులో ఆదరణ పొందాను.. భారతదేశం అంటే అదీ..’ అని ఐఏఎస్ అధికారి రాసుకొచ్చారు.
‘మౌలానా ఆజాద్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు భారత దేశం ఎప్పుడూ అందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది. అత్యున్నత స్థానాలకు మార్గాలను అందరికీ తెరిచి ఉంచింది. నేను దీనిని చెప్పడం తప్పేమీ కాదు. ఎందుకంటే స్వయంగా నేను శిఖరం అంచులకు వెళ్లి నన్ను నేను చూసుకున్నా..’ అని ట్వీట్ చేశారు.
BJP vs opposition war of words: బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాల మాటల యుద్ధం
యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైన తరుణంలో ఇండియా, అలాగే మెజారిటీ విధానాన్ని పాటించే పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠం ఉందని కాంగ్రెస్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘యూఎస్, యూకే ప్రజలు నాన్ మెజారిటీ పౌరులను తమ దేశాల్లో అత్యున్నత పదవులకు ఎన్నుకున్నారు.. ’ అని చిదంబరం ట్వీట్ చేశారు.
రిషి సునాక్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన తరహాలో ఈ దేశంలో అలాంటి పరిణామం ఎప్పుడైనా జరుగుతుందా? అని శశి థరూర్ ప్రశ్నించారు. అయితే బీజేపీ వీటికి స్పందిస్తూ దేశంలో ముగ్గురు ముస్లింలు, ఒక సిక్కు మతస్తుడు రాష్ట్రపతిగా, ఒక సిక్కు మతస్తుడు 10 ఏళ్లపాటు ప్రధానిగా ఉన్నారని వ్యాఖ్యానించింది.
బీజేపీ నేత షెహజాద్ పూనావాళా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘శశిథరూర్, చిదంబరం డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఎన్నడూ ప్రధానిగా పరిగణించనట్టుంది. కారణాలేంటో వారికే తెలుసు..’ అని వ్యాఖ్యానించారు.