USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య
USA Crime News: పాఠశాలలో సహ విద్యార్థులు తనను ఎగతాళి చేస్తున్నరన్న ఆవేదనతో 10 సంవత్సరాల విద్యార్థి ఆత్యహత్య చేసుకున్న ఘటన అమెరికాలోని ఇండియానాలో జరిగింది. స్కూల్ లో, స్కూల్ బస్ లో సహ విద్యార్థుల వేధింపులు తాళలేక పదేళ్ల సామీ టుష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
USA Crime News: గత కొన్ని రోజులుగా పాఠశాలలో సహ విద్యార్థుల వేధింపులు భరించలేక అమెరికాలోని ఇండియానాకు 10 ఏళ్ల బాలుడు సామీ టుష్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ మేట్స్ తో పాటు ఇతర స్టుడెంట్స్ వేధింపులపై గత ఏడాది కనీసం 20 సార్లు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
బాత్రూమ్ లోనూ ఏడిపించారు..
సామీ టుష్ అమెరికాలోని ఇండియానా లో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఇంటర్మీడియట్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతడిని సహ విద్యార్థులు వేధిస్తున్నారు. సామీ టుష్ కళ్లజోడుపై, అతడి దంతాల తీరుపై ఎగతాళి చేస్తున్నారు. స్కూల్ లోనే కాకుండా, స్కూల్ బస్ లోనూ ఏడిపిస్తున్నారు. చివరకు స్కూల్ బాత్రూమ్ లో కూడా ఏడిపించారు. ఈ విషయాన్ని సామీ టుష్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు స్కూల్ యాజమాన్యానికి పలు మార్లు ఫిర్యాదు చేశారు. కానీ, సామీ టుష్ పై సహ విద్యార్థుల వేధింపులు ఆగలేదు. సుమారు 20 సార్లు ఈ వేధింపుల గురించి స్కూల్ యాజమాన్యానికి తెలియజేశామని సామీ తల్లిదండ్రులు సామ్, నికోల్ పేర్కొన్నారు. ‘మొదట్లో సామీ కళ్లద్దాలను, ఆ తర్వాత అతడి పళ్లను ఎగతాళి చేస్తూ వచ్చారు. ఇది చాలా కాలం కొనసాగింది’ అని అతడి తల్లి సామ్ తెలిపింది. ‘‘స్కూల్ బస్సులో తనను కొట్టారని, తన కళ్లద్దాలు పగులగొట్టారని సామీ టుష్ చెప్పాడు. నేను స్కూల్ కి ఫోన్ చేశాను’’ అని వివరించింది.
స్కూల్ స్పందన
సామీ టుష్ కానీ, లేదా అతని తల్లిదండ్రులు కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ డాక్టర్ హెరాల్డ్ ఓలిన్ చెప్పాడు. సంవత్సరం పొడవునా, సామీ కుటుంబంతో పాఠశాల నిర్వాహకులు, కౌన్సిలర్ క్రమం తప్పకుండా ఈ విషయంపై చర్చించారని అతను అంగీకరించాడు. వేధింపుల గురించి పాఠశాల యాజమాన్యానికి తెలుసునని సామి కుటుంబం చెబుతోంది. ‘సాధారణంగా పిల్లల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నమ్ముతారు.కానీ వాళ్లు మా నమ్మకాన్ని వమ్ము చేశారు’ అని సామీ నానమ్మ సింథియా టుష్ ఆవేదన వ్యక్తం చేసింది.