ఆపరేషన్ సిందూర్ పేరుపై భారత్ సాగించిన ముప్పేట దాడితో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయే పరిస్థితి నెలకొంది. బలూచిస్తాన్ ఉద్యమకారులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.
పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం ప్రకటించుకుంటూ బలూచిస్థాన్ జాతీయవాద నాయకులు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. బలూచిస్తాన్ వీధుల్లో ఉద్యమకారులు తమ ప్రత్యేక జెండాతో ప్రదర్శనలు నిర్వహించారు. అదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో "రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్" అనే పదం ట్రెండింగ్ గా మారింది.
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత, భారత్ తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ పై విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోకి చొరబడి, వైమానిక దాడులతో ఆ దేశంలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ దాడుల్లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అనంతరం, పాక్ దాడులకు దిగడంతో భారత్ ప్రతిదాడులతో ప్రతిస్పందించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది.
భారత్ తో ఉద్రిక్తతలతో పాకిస్తాన్ దృష్టి అటువైపు ఉన్న సమయంలో, బలూచిస్తాన్ ఉద్యమకారులు తమ ప్రాంతాన్ని పాక్ నుంచి విడిపించే ప్రయత్నాలు ప్రారంభించారు. కీలక నగరం క్వెట్టాను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, బలూచిస్తాన్ స్వాతంత్య్రం సాధించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, బలూచిస్తాన్ లోని పలు ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి.
పాకిస్తాన్ వివక్ష నుంచి తాము బయటకు వచ్చామని, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా మారామని అక్కడి ప్రఖ్యాత రచయిత, బలూచిస్థాన్ హక్కుల న్యాయవాది అయిన మీర్ యార్ బలూచ్ సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లను షేర్ చేశారు. న్యూఢిల్లీలో బలూచిస్థాన్ రాయబార కార్యాలయాన్ని అనుమతించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్ సైన్యాన్ని ఈ ప్రాంతం నుండి ఉపసంహరించుకోవాలని కూడా ఆయన కోరారు.
"ఉగ్రవాద పాకిస్తాన్ పతనం దగ్గర పడినందున త్వరలో ఒక ప్రకటన చేయాలి. మేము మా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాము. ఢిల్లీలో బలూచిస్తాన్ అధికారిక కార్యాలయం, రాయబార కార్యాలయాన్ని అనుమతించాలని మేము భారతదేశాన్ని అభ్యర్థిస్తున్నాము" అని ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారు. ఐక్యరాజ్యసమితి దీనిని గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. "డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’’ స్వాతంత్య్రాన్ని గుర్తించాలని కోరారు. ఐరాస సభ్య దేశాల సమావేశం ఏర్పాటు చేసి తమకు మద్ధతు ఇవ్వాలని, నిధులు అందజేయాలని కోరారు.
అదే సమయంలో, ప్రత్యేక బలూచిస్తాన్ కు మద్ధతుదారులైన సోషల్ మీడియా వినియోగదారులు స్వతంత్ర బలూచిస్తాన్‌ను చూపించే మ్యాప్‌ను సిద్ధం చేసి షేర్ చేశారు. దాని ప్రత్యేక జెండాను కూడా రూపొందించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల పాకిస్తాన్ పై 51 ప్రదేశాలలో దాడులు చేసింది. స్వాతంత్య్రం కోసం కొనసాగుతున్న 'ఆపరేషన్ హెరోఫ్'లో భాగంగా. పాకిస్తాన్ సైనిక, నిఘా ప్రదేశాలతో పాటు స్థానిక పోలీసు స్టేషన్లు, ఖనిజ రవాణా వాహనాలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
బలూచిస్తాన్ అత్యధికంగా ఖనిజ వనరులు ఉన్న ప్రాంతం. ఆర్థికంగా పాకిస్తాన్ కు ఎంతో తోడ్పడుతోంది. కానీ, పాక్ నుంచి వివక్షను ఎదుర్కొంటోంది. మొదట్లో కలత్ రాచరిక రాష్ట్రంలో భాగమైన బలూచిస్తాన్‌ను 1948లో వివాదాస్పద పరిస్థితులలో పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది. దీనిని బలూచ్ జాతీయవాదులు బలవంతంగా చేపట్టిన ఏకీకరణగా భావించారు. అప్పటి నుంచి తిరుగుబాటు కొనసాగించారు. బలూచిస్తాన్ భౌగోళికంగా కూడా అత్యంత కీలక ప్రాంతం.
సంబంధిత కథనం
టాపిక్