Republic Day Parade : కర్తవ్య పథ్​లో అట్టహాసంగా రిపబ్లిక్​ డే పరేడ్​..-republic day parade 2025 at kartavya path murmu and pm modi present ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Republic Day Parade : కర్తవ్య పథ్​లో అట్టహాసంగా రిపబ్లిక్​ డే పరేడ్​..

Republic Day Parade : కర్తవ్య పథ్​లో అట్టహాసంగా రిపబ్లిక్​ డే పరేడ్​..

Sharath Chitturi HT Telugu
Jan 26, 2025 12:01 PM IST

Republic Day Parade : దిల్లీ కర్తవ్య పథ్​లో రిపబ్లిక్​ డే పరేడ్ ఘనంగా​ సాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతరులు ఈ పరేడ్​లో పాల్గొన్నారు.

దిల్లీ కర్తవ్య పథ్​లో రిపబ్లిక్​ డే పరేడ్​..
దిల్లీ కర్తవ్య పథ్​లో రిపబ్లిక్​ డే పరేడ్​..

76వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దిల్లీ కర్తవ్య పథ్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్​ఖడ్​ సహా అనేక మంది కేంద్రమంత్రులు, నేతలు కర్తవ్య పథ్​లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఏడాది.. "స్వర్ణిమ్​ భారత్​- విరాసత్​ ఔర్​ వికసిత్​' అనే థీమ్​తో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుని మొత్తం మీద ఈసారి 31 శకటాలను ప్రదర్శనకు వచ్చాయి. అంతేకాదు, త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి పరేడ్​లో ప్రత్యేకమని చెబుతున్నారు. వీటితో పాటు బ్రహ్మోస్- ఆకాశ్​ మిసైళ్లు,​ ఇతర రాకెట్ల ప్రదర్శన సైనిక శక్తిని ప్రతిబింబించాయి.

కట్టుదిట్ట భద్రత మధ్య..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ భద్రతా వలయంలోకి జారుకుంది. కర్తవ్య పథ్​ మార్గంలో ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి పరేడ్ ముగిసే వరకు కార్తవ్య మార్గాన్ని అన్ని వాహనాల రాకపోకలకు మూసివేశారు. దేశ రాజధానిలోకి ప్రవేశాన్ని పరిమితం చేశారు. నిత్యావసర వాహనాలను మాత్రమే అనుమతించారు. రిపబ్లిక్ డే పరేడ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

జాతీయ యుద్ధస్మారకంలో నివాళులు..

అంతకుముందు, రిపబ్లిక్​ డే సందర్భంగా జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లిన ప్రధాని మోదీ, అమరవీరులను స్మరించుకుని, 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మోదీ.. కాషాయ, ఎరుపు రంగు సఫా, గోధుమ రంగు బంద్​గాలా కోటు, క్రీమ్ కలర్ చుడీదార్ కుర్తా సెట్ ధరించారు.

దేశవ్యాప్తంగా రిపబ్లిక్​ డే వేడుకలు..

అటు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రా ముఖ్యమంత్రులు, గవర్నర్​లు.. జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు కేంద్రమంత్రులు సైతం తమతమ కార్యాలయాల్లో జెండా వందనం చేసి సెల్యూట్​ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.