New Delhi CM: ఢిల్లీ తదుపరి సీఎంగా రేఖా గుప్తా; రేపు ప్రమాణ స్వీకారం
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ మహిళను ఎంపిక చేసింది. యువ నేత రేఖ గుప్తా ఢిల్లీ సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఫిబ్రవరి 20న రామ్ లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఎన్డీయే పాలిత 19 రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.

ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా యువ నేత రేఖ గుప్తాను బీజేపీ ఎంపిక చేసింది. దేశరాజధానిలో భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలోకి వచ్చిన వారం రోజుల తరువాత, ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి పేరును పార్టీ ఖరారు చేసింది. బుధవారం సాయంత్రం బిజెపి శాసనసభ సమావేశంలో రేఖ గుప్తాను తదుపరి సీఎంగా నిర్ణయించారు. ఫిబ్రవరి 20న రామ్ లీలా మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే పాలిత 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే కార్యక్రమంలో కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేఖా గుప్తా ఎవరు?
ఢిల్లీ బీజేపీలో రేఖా గుప్తా యువ నాయకురాలు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ మహిళా మోర్చా కు ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో శాలీమార్ బాగ్ స్థానం నుంచి 29 వేల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు.
బీజేపీ ఘన విజయం
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. అయితే, బీజేపీ సీఎం అభ్యర్థి లేకుండానే ఎన్నికల్లో పోటీ చేసింది. ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా సీఎం పీఠం ఎవరికి దక్కుతుందో ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు, యువ నాయకురాలు రేఖా గుప్తాను తదుపరి సీఎంగా బీజేపీ నిర్ణయించింది.