జమ్మూ కశ్మీర్లో ప్రాంతీయ పార్టీలదే హవా-regional parties dominate political landscape in jammu and kashmir ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జమ్మూ కశ్మీర్లో ప్రాంతీయ పార్టీలదే హవా

జమ్మూ కశ్మీర్లో ప్రాంతీయ పార్టీలదే హవా

HT Telugu Desk HT Telugu
Aug 26, 2024 03:56 PM IST

జమ్మూకశ్మీర్ ఎన్నికలపై స్థానిక ప్రజల అభిప్రాయం ఎలా ఉంది..? పార్టీల బలబలాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలను అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణ ఇక్కడ చూడొచ్చు.

జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం
జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం (HT_PRINT)

జమ్మూ కశ్మీర్లో సుమారు పది సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి ఏర్పడబోయే ప్రభుత్వం గతంలో కంటే భిన్నంగా ఉండబోతుంది. ఇంతకుముందు రాష్ట్ర హోదాలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కశ్మీర్లో పోలీసు, ఉద్యోగుల నియామకం, బదిలీలు, ప్రాసిక్యూషన్ అనుమతి, ఆర్థిక విషయాలు వంటి ముఖ్య అధికారాలను కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టింది. జమ్మూ కశ్మీర్ పునర్వవ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 55 ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలను మంత్రిమండలి సమీక్షంచకూడదు. ఈ చట్టం ప్రకారం జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఓటు హక్కు ఉంటుంది. కానీ, ఢిల్లీలోని అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం లాగే ఇక్కడ కూడా ఎన్నికైన ప్రభుత్వానికి సంపూర్ణహక్కులు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలపై స్థానిక ప్రజల అభిప్రాయం ఎలా ఉంది..? పార్టీల బలబలాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలను అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది.

ఈ ఎన్నికలు జమ్మూ కశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించడంతో పాటు మన దేశ సమైక్య స్ఫూర్తికి పరీక్ష కాబోతున్నాయని మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. 1987లో జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాలను మార్చి వేశాయి. అంతకుముందు ఐదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్షరెన్స్ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో 1986లో కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇస్లామిక్ గ్రూపులతో ఏర్పాటైన ముస్లిం యూనైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్) 1987 ఎన్నికల్లో గెలుస్తుందనే వాతావరణం ఏర్పడింది.

అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 75 శాతం పోలింగ్ నమోదైన ఆ ఎన్నికల్లో మొత్తం 76 స్థానాలకుగాను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) 40, కాంగ్రెస్ 26 సీట్లు గెలిచాయి. ఎంయూఎఫ్ కేవలం నాలుగు సీట్లకే పరిమితం కావడంతో ఆ ఎన్నికల్లో ఢిల్లీ పెత్తనంతో రాష్ట్రంలో భారీగా రిగ్గింగ్ జరిగిందని ప్రధానంగా యువతలో తీవ్ర అసంతృప్తి రేగింది. ఎంయూఎఫ్‌కు మద్దతిచ్చిన యువతలో చాలామంది మిలిటెంట్ గ్రూపుల్లో చేరారు. ‘‘దీంతో ఎన్నికల మీద నమ్మకం పోయింది. అప్పటి నుంచి ఇక్కడ తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి అదీ ఒక కారణంగా మారింది.’’ అని శ్రీనగర్లో మా బృందానికి కలిసిన ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అభిప్రాయపడ్డారు.

1987లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు అనుకూలంగా జరిగినట్టే, ఇప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయనే అనుమానాలు ప్రజల్లో ఉంది. జమ్మూ ప్రాంతంలో బీజేపీ క్రమంగా బలపడింది. 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8.6 శాతం ఓట్లతో ఒక్క సీటే గెలచుకున్న బీజేపీ 2008 ఎన్నికల నాటికి 11.28 శాతం ఓట్లు పెంచుకుని, 11 స్థానాల్లో విజయం సాధించింది.

ఆ తర్వాత ఆరేళ్లకు 2014లో జరిగిన ఎన్నికల్లో 23.2 శాతం ఓట్లతో ఏకంగా 25 సీట్లు గెలుచుకుని, పీడీపీతో జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 23 శాతం ఓట్లు రాగా, పుల్వామా దాడి ఘటనతో 2019లో బీజేపీ ఓటింగ్ 46 శాతానికి పెరిగింది. అయితే, 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అది 24 శాతానికి పడిపోయింది. ఈ 24 శాతం కూడా మొత్తం జమ్మూ ప్రాంతంలోనే వచ్చింది.

పెరిగిన అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు 37 నుంచి 43కు పెరిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో 43 సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో ఉన్న రెండు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కశ్మీర్ ప్రాంతంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు 46 నుంచి 47కు పెరిగాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్న మూడు లోక్సభ స్థానాల్లో రెండింటినీ ఎన్సీ గెలుచుకోగా, మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాపై ఇంజనీర్ రషీద్‌గా గుర్తింపు పొందిన అబ్దుల్ రషీద్ షేక్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీడీపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. కశ్మీర్లోని మూడు స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులనే నిలబెట్టలేదు. జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల ప్రజలకు భిన్నమైన రాజకీయ అభిరుచులు ఉన్నాయని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

జమ్మూ కశ్మీర్లో ఏ మూలకు వెళ్లి.. ఎన్నికలపై ఎవరిని కదిలించినా నిరుద్యోగంతో పాటు అవినీతి పెరిగిందని, పరిపాలనతో పాటు వ్యాపారాల్లో కూడా స్థానికేతరుల జోక్యం తట్టుకోలేకపోతున్నామని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు జమ్మూ కశ్మీర్ను పాలించిన ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీ, బీజేపీలు ఈ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ప్రజలు ఏకాభిప్రాయంగా చెబుతున్నారు.

వీటికి ప్రత్యామ్నాయంగా నూతన పార్టీలు రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు మా బృందం పరిశీలనలో కనిపించింది. సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని ఏలిన అబ్దుల్లా కుటుంబానికి చెందిన ఎన్సీ పార్టీ ఆర్టికల్ 370 రద్దును ఆపడంలో పూర్తిగా విఫలమైందని కశ్మీరీలు మొహమాటం లేకుండా విమర్శిస్తున్నారు. ఎన్సీ విశ్వాసం కోల్పోయినా లోయలో మరో బలమైన పార్టీ లేకపోవడంతో ప్రజలకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఎన్సీ రాష్ట్రంలో సంస్థాగతంగా బలంగా ఉండడంతో పాటు కాంగ్రెస్ కూడా జతకలవడంతో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయలో అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.

పీడీపీ సిద్ధాంతాల పట్ల కశ్మీరీలకు అనుమానాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ క్షేత్రస్థాయి పరిశీలనలో కనిపించింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ 2014లో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రజామద్దతు కోల్పోయింది. దక్షిణ కశ్మీర్లోనే పీడీపీకి బలమైన నెట్వర్క్ ఉండడంతో ఇక్కడ ఎన్సీతో హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలున్నాయి. దక్షిణ కశ్మీర్లోని అనంత్‌నాగ్, కుల్గాం, పుల్వామా, షోపియన్ జిల్లాల్లో ఉన్న 18 సెగ్మంట్లలో పీడీపీ ప్రభావం ఉంటుంది.

సంప్రదాయ కశ్మీరీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో కొత్తగా కొన్ని పార్టీలు గతంలో వచ్చాయి, ఇప్పుడు కూడా పుట్టుకొచ్చాయి. కానీ, నాటి నుంచి నేటి వరకు వాటి ప్రభావం తక్కువే. అల్తాఫ్ బుఖారీ స్థాపించిన అప్నీ పార్టీ సిద్ధాంతాలతో కాకుండా అభివృద్ధి ఎజెండాగా పని చేస్తుంది. కానీ, బీజేపీ అనుకూల విధానాల వల్ల ఈ పార్టీకి విశ్వసనీయత కొరవడింది. ఈ పార్టీలోని కొంతమంది బలమైన నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నా వేళ్ల మీద లెక్కబెట్టదగిన నియోజకవర్గాలకే పరిమితం.

కేంద్ర మాజీ మంత్రి, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబి ఆజాద్ కాంగ్రెస్‌ను వీడి సొంతంగా ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో బలమైన నాయకులను పార్టీలోకి ఆకర్షించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో సొంత ఇలాకా జమ్మూలో కూడా బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ఆజాద్‌కు పెను సవాలే. లోక్సభ ఎన్నికల్లో అందరూ ఆశ్చర్యపోయే విధంగా బారముల్లా నుంచి ఎంపీగా గెలిచిన ఇంజనీర్ రషీద్ నేతృత్వంలోని అవామీ ఇత్తేహద్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్వారా జిల్లా దాటి ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఈ జిల్లాలో ఎన్సీ, పీడీపీ బలంగా ఉండడంతో త్రిముఖ పోటీ జరిగినా అవామీ ఇత్తేహద్ ప్రభావం నామమాత్రమే.

జమ్మూలో బీజేపీ ఆధిక్యతకు అవకాశాలు

కశ్మీర్ ప్రాంతంలో బీజేపీ ప్రభావం స్వల్పమే అయినా, జమ్మూలో ఆధిక్యత చూపే అవకాశాలున్నాయి. జమ్మూలో హిందూ జనాభా ఎక్కువ. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో బీజేపీ అత్యధిక సీట్లు గెలవవచ్చు. అయితే ఉగ్రవాద దాడులు కశ్మీర్ బదులు జమ్మూలో పెరగడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఇక్కడ అసంతృప్తి పెరిగింది. ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించిన మోదీ సర్కారు పునరుద్ధరించకపోవడంపై కూడా జమ్మూలో అసంతృప్తి ఉంది.

కాంగ్రెస్ 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలవకపోయినా జమ్మూ కశ్మీర్లో ఆ పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయలేం. 1967, 1972లో వరుసగా రెండుసార్లు సొంత మోజార్టీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉంది. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ శ్రీనగర్లో యాత్రను ముగించడంతో పార్టీ పటిష్టతో పాటు రాష్ట్రంలో పార్టీకి కొంత సానుకూల వాతావరణం కూడా ఏర్పడిరది. నిరుద్యోగం పెరిగిపోడంతో ప్రధానంగా జమ్మూలో యువత కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్దరణపై కాంగ్రెస్ గట్టిగా గళం వినిపించడం కూడా పార్టీకి కలిసివస్తోంది. కాంగ్రెస్ బలాన్ని అంచనా చేసిన ఎన్సీ పొత్తుపెట్టుకొని, జమ్మూ ప్రాంతంలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్‌కు వదిలేయాలని భావించడంతో ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముఖాముఖిగా తలపడే అవకాశాలున్నాయి.

జమ్మూ కశ్మీర్లో చివరిసారిగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధికంగా 28 సీట్లు సాధించగా, బీజేపీ 25, ఎన్సీ 15, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలిచింది. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికలను అధ్యయనం చేస్తే ఎన్సీకి 36, బీజేపీకి 29, కాంగ్రెస్‌కు 7, పీడీపీకి 5 సెగ్మంట్లలో స్థానాల్లో ఆధిక్యత వచ్చింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే జమ్మూ కశ్మీర్లో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో జతకట్టాల్సిన ఆవశ్యకత తెలుస్తుంది. ఈ పరిణామాలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు తోకపార్టీలుగా మారుతున్నాయి.

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన పీడీపీ, ఎన్సీ పార్టీలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ‘బీ’ టీమ్‌లుగా మారాయనే విమర్శలున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అప్నీ, డీపీఏపీ వంటి చిన్న చిన్న పార్టీలు బీజేపీకి ‘బీ’ టీములుగా వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొనడంతో ఈ చిన్న పార్టీలు నష్ట పోయే అవకాశాలు పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది.

బీజేపీ జమ్మూలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, 2014లో చేసినట్టు ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తుండగా, కాంగ్రెస్ జమ్మూలో బీజేపీని ఓడించి, ఎన్సీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పావులు కదుపుతోంది. పీడీపీ కూడా కాంగ్రెస్‌తో కలవాలని చూస్తున్నా సీట్ల సర్థుబాటు అంత సులభం కాదని వెనక్కి తగ్గుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్సీ, పీడీపీ రెండింటితో పొత్తు పెట్టుకుంది. మూడు పార్టీలు ఒక కూటమిలో ఉన్నా ఎన్సీ, పీడీపీ పార్టీలు ఎవరికి వారే పోటీ చేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా పీడీపీ కూడా అవరసరాన్ని బట్టి ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.

పీపుల్స్ పల్స్ పరిశీలనలో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు అధిక స్థానాలు గెలిచే అవకాశాలుండడంతో అవి రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టకుండా వ్యవహరించాలని క్షేత్రస్థాయిలో ప్రజలు ఆశిస్తున్నారు. మన దేశంలో ఆర్టికల్ 371పై ఆధారపడ్డ మరో 8 రాష్ట్రాల భవితవ్యాన్ని నిర్ణయించనున్న ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కఠిన పరీక్ష కాబోతున్నాయి. అయితే, ఈ పరీక్షలో ఎవరు గెలిచినా, గవర్నర్‌కు సర్వాధికారాలు కట్టబెట్టడంతో జమ్మూ కశ్మీర్లో ఏర్పడే నూతన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సిన పరిస్థితులే ఉంటాయి. జమ్మూ కశ్మీర్లో సుదీర్ఘకాలంగా ఢిల్లీ ఆధిపత్యాన్ని సహించలేపోతున్న స్థానికులు ఇప్పటికైనా కేంద్రం పెత్తనం లేని ప్రభుత్వమే రాష్ట్రంలో ఉండాలని బలంగా కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల అభీష్టం నెరవేరుతుందా..? లేదా..? అనేది అక్టోబర్ 4న వెలువడే ప్రజా తీర్పులో తేలనుంది.

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ

జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్
జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్

(వ్యాసకర్త తెలిపిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు, వ్యాఖ్యానాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు