భారత దేశంలో నిత్యం చిత్ర, విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూనే ఉంటాయి. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు వైరల్ అయ్యింది! రైలు అప్పర్ బెర్త్‌లో అండర్వేర్లు, బనియన్లు ఆరేసి ఉన్న ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
భారతదేశంలో రద్దీగా ఉండే రైళ్లలో ప్రయాణించడం చాలావరకు ఒత్తిడితో కూడిన అనుభవంగా ఉంటుంది. కాస్త చోటు కోసం ప్రయాణికులు తోసుకోవడం, నెట్టుకోవడం వంటి దృశ్యాలు సర్వసాధారణం. అయితే రైలు ప్రయాణంలో ఒక ప్రయాణికుడికి 'సివిక్ సెన్స్' (సామాజిక స్పృహ) లేకపోవడంపై ఇటీవల రెడిట్ పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది.
“ఇండియన్ రైల్వేస్‌లో మాత్రమే" అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ ఫొటోలో ఒక జనరల్ కోచ్‌లో ప్రయాణికుడు అప్పర్ బెర్త్‌కు అమర్చిన యూటిలిటీ ర్యాక్‌పై బట్టలు ఆరబెట్టడం కనిపించింది!
ఆ పోస్ట్‌ను షేర్ చేసిన యూజర్, “ఆగస్టు 15, 2025, సుమారు ఉదయం 10 గంటలకు. బెంగళూరు - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 12975/12976) ఇది. నాకు ఏసీ కోచ్ దొరకలేదు, కానీ ఉచిత లాండ్రీ సేవ మాత్రం దొరికింది,” అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
ఈ ఫొటో ఇన్స్టెంట్గా వైరల్ అయ్యింది. అయితే సోషల్ మీడియా వినియోగదారులు సదరు ప్రయాణికుడిని తీవ్రంగా విమర్శించారు.
"అతని లోదుస్తులు చూడటం మీకు ఇష్టం లేదని చెప్పండి," అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరొకరు, "ఓహ్ మై గాడ్, ఇది షాకింగ్‌గా ఉంది," అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకొకరు, "చాలా మందికి, విదేశాలలో కూడా సివిక్ సెన్స్ సమస్యలు ఉన్నాయి. కానీ ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది," అని అభిప్రాయపడ్డారు.
భారతీయ రైల్వే ప్రయాణికులు అసాధారణ చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం, ఒక వైరల్ వీడియోలో, ఒక ప్రయాణికుడు తాత్కాలికంగా సీటు చేసుకోవడానికి రెండు బెర్త్‌లను తాడుతో కట్టాడు.
సీట్లు తరచుగా పరిమితంగా ఉండే భారతీయ రైళ్లలో ప్రయాణించే సవాళ్ల గురించి ఈ క్లిప్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. కొందరు ఈ పని వెనుక ఉన్న సృజనాత్మకతను మెచ్చుకుంటే, మరికొందరు ఇది తోటి ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని విమర్శించారు.
మరి వీటిపై మీ స్పందన ఏంటి?
సంబంధిత కథనం