Hanuman Chalisa row | ‘దాదాగిరి చేస్తే..’- బీజేపీపై ఉద్ధవ్ ఠాక్రే​ ఫైర్​-recite hanuman chalisa at my home but won t tolerate dadagiri uddhav ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Recite Hanuman Chalisa At My Home But Won't Tolerate 'Dadagiri': Uddhav

Hanuman Chalisa row | ‘దాదాగిరి చేస్తే..’- బీజేపీపై ఉద్ధవ్ ఠాక్రే​ ఫైర్​

HT Telugu Desk HT Telugu
Apr 25, 2022 10:20 PM IST

మహారాష్ట్ర: హనుమాన్​ చాలీసా వివాదంపై తొలిసారిగా స్పందించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. తన ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుకోవచ్చని.. కానీ దాదాగిరి చేస్తే మాత్రం.. ఏం చేయాలో తనకు బాగా తెలుసునని హెచ్చరించారు.

ఉద్ధవ్​ ఠాక్రే
ఉద్ధవ్​ ఠాక్రే (PTI/file)

Uddhav Thackeray Hanuman Chalisa | హనుమాన్​ చాలీసా వివాదం నేపథ్యంలో విపక్ష బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే. తన ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదవాలి అనుకుంటే చదువుకోవచ్చని.. కానీ దాదాగిరి చేస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తనకు తెలుసని మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

మహారాష్ట్రలో కొన్ని రోజుల క్రితం.. హనుమాన్​ చాలీసా వివాదం రాజుకుంది. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.. హిందుత్వాన్ని మర్చిపోయారని, ఆయనకు తిరిగి పరిచయం చేయాలని ఎంపీ నవ్​నీత్​ రాణా, ఆమె భర్త, బీజేపీ ఎమ్మెల్యే రవి రాణా వ్యాఖ్యనించారు. ఈ క్రమంలోనే సీఎం నివాసమైన మతోశ్రీ వద్ద హనుమాన్​ చాలీసా చదువుతామని పేర్కొన్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య దంపతులు అరెస్ట్​ అయ్యారు. ప్రస్తుతం వారిద్దరు వేరువేరు జైళ్లల్లో ఉన్నారు. తమపై దాఖలైన ఎఫ్​ఐఆర్​లను రద్దు చేయాలని వారు చేసిన విజ్ఞప్తిని కోర్టు కొట్టివేసింది. అయితే.. ఈ పూర్తి వ్యవహారంలో నవ్​నీత్​ రాణా దంపతులకు బీజేపీ అండగా నిలిచింది. ఉద్ధవ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది.

తాజాగా.. హనుమాన్​ చాలీసా వివాదంపై తొలిసారిగా స్పందించారు ఉద్ధవ్​ ఠాక్రే. ఈ క్రమంలోనే ఒకనాటి మిత్రపక్షమైన బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

Uddhav Thackeray | "నా ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతారా? సరే చదువుకోండి. కానీ హనుమాన్​ చాలీసా పేరుతో దాదాగిరి చేస్తే మాత్రం సహించము. ఏం చేయాలో మాకు బాగా తెలుసు. శివసేనకు సవాలు విసిరితే.. భీముడి స్వరూపాన్ని, మహా రుద్రుడి స్వరూపాన్ని చూపిస్తాము. మా హిందుత్వం.. హనుమంతుడి అంత బలంగా ఉంటుంది. శివసేన హిందుత్వాన్ని వదిలేసిందని కొన్ని రోజులుగా బీజేపీ అరుస్తోంది. హిందుత్వాన్ని ఎలా వదిలేస్తాము? అది ఏమైనా లుంగీయా? వేసుకుని, తీసేయడానికి! మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హిందుత్వ.. హిందుత్వ అని అరుస్తున్న వారు.. అసలు హిందుత్వం కోసం ఏం చేశారు?," అని ఉద్ధవ్​ ఠాక్రే విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలో బాబ్రీ మసీదు ఘటనను గుర్తు చేశారు మహారాష్ట్ర సీఎం.

"బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత.. మీరందరు పారిపోయారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది మీ ప్రభుత్వం గొప్ప కాదు. గుడి నిర్మించాలని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు పాటిస్తున్నారు అంతే. ఇందులో హిందుత్వ ఎక్కడుంది?," అని ఉద్ధవ్​ ఠాక్రే మండిపడ్డారు.

ఎన్నికల కోసమేనా?

Shiv Sena vs BJP | హిందుత్వ, హనుమాన్​ చాలీసా వ్యవహారంతో కొన్ని రోజులుగా మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ దుమారం నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. త్వరలో బృహన్​ముంబై కార్పొరేషన్​కు ఎన్నికలు జరగనున్న వేళ.. ఈస్థాయిలో వివాదం చెలరేగడం గమనార్హం.

ఉద్ధవ్​ ఠాక్రేపై విపక్షాలు అన్ని విధాలుగా విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​.. ఉద్ధవ్​పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం హనుమాన్​ చాలీసా వివాదాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాణా దంపతులను అరెస్టు చేయడంతో ఉద్ధవ్​.. తనలోని హిట్లర్​ను బయటకు తీసుకొచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వం.. హనుమాన్​ చాలీసాను చదవడం దేశద్రోహంగా భావిస్తోందని ఆరోపించారు. అదే జరిగితే.. తామంతా దేశద్రోహానికి పాల్పడతామని హెచ్చరించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం