హైదరాబాద్‌లో ఒకే డీల్‌లో 600 ఎకరాల భూమి కొనుగోలు
న్యూఢిల్లీ, మే 26: గడిచిన ఐదు నెలల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో జరిగిన 28 భారీ ఒప్పందాల్లో 1,200 ఎకరాల భూములు చేతులు మారాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ వెల్లడించింది.
కోవిడ్ అనంతర పరిణామాల్లో భూముల కొనుగోలు చేయాలన్న డెవలపర్లు, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థల ఆకాంక్ష కొనసాగుతోందని తెలిపింది.
రియల్ ఎస్టేట్ అసెట్ క్లాసెస్‌లో భవిష్యత్తు అభివృద్ధి దృష్ట్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యమైన స్థలాలపై డెవలపర్లు దృష్టి పెట్టారని తెలిపింది.
‘2021 ప్రథమార్థంతో పోలిస్తే ఒప్పందాలు రెట్టింపయ్యాయి. 14 ఒప్పందాల నుంచి 28 ఒప్పందాలకు పెరిగాయి..’ అని అనరాక్ ఛైర్మన్ అనూజ్ పూరి తెలిపారు.
వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ హౌజింగ్ డిమాండ్ పెరుగుతున్నందున రెసిడెన్షియల్ ప్రాజెక్టుల అభివృద్ధి మొదటి ప్రాధాన్యతగా ఉందని తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 28 ఒప్పందాల్లో విభిన్న సంస్థలు 1,237 ఎకరాలు కొనుగోలు చేశాయని తెలిపారు.
వీటిలో 18 ఒప్పందాల్లో 351 ఎకరాలు వివిధ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం తీసుకున్నవని అనరాక్ తెలిపింది.
మరో 115 ఎకరాలు ప్రతిపాదిత డేటా సెంటర్ల కోసం కొనుగోలు చేసినవని అనరాక్ తెలిపింది. ఇక మరో రెండు ఒప్పందాల్లో 63 ఎకరాలు లాజిస్టిక్స్, వేర్ హౌజింగ్ ప్రాజెక్టుల కోసం కొనుగోలు చేసినవని తెలిపింది. మరో నాలుగు ఒప్పందాల్లో 108 ఎకరాలను విభిన్న ప్రాజెక్టుల అభివృద్ధికి తీసుకున్నారు.
‘హైదరాబాద్‌లో ఒక ఒప్పందంలో 600 ఎకరాల భూమి చేతులు మారింది. అయితే ఈ ఒప్పందం వేటి మధ్య జరిగిందన్న సంగతి వెలుగులోకి రాలేదు..’ అని అనరాక్ తెలిపింది.
గడిచిన ఐదు నెలల్లో చాలా భూముల కొనుగోలు లావాదేవీలతో హైదరాబాద్ మార్కెట్ చాలా క్రియాశీలకంగా ఉంది. 5 నిర్ధిష్ట ఒప్పందాల్లో 715 ఎకరాల లావాదేవీలు జరిగాయి.
బెంగళూరు మూడు వేర్వేరు ఒప్పందాల్లో భాగంగా 140 ఎకరాల క్రయవిక్రయాలు జరిగాయి. ఇవి నివాస ప్రాజెక్టులు, లాజిస్టిక్స్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం జరిగిన లావాదేవీలు. ఢిల్లీ-ఎన్సీఆర్ 5 విడి ఒప్పందాల్లో 106.3 ఎకరాల మేర క్రయవిక్రయాలు జరిగాయి. గురుగ్రామ్, ఢిల్లీ, ఫరీదాబాద్, నోయిడా తదితర ప్రాంతాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఆయా ప్రతిపాదిత ప్రాజెక్టులు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, గిడ్డంగులు తదితర మిశ్రమ వినియోగం కోసం ఉద్దేశించినవి.
ఇక పూణే నగరంలో 5 వేర్వేరు ఒప్పందాల్లో 91.1 ఎకరాల క్రయవిక్రయాలు జరిగాయి. ఇక భూమి కొరత ఎదురవుతున్న ముంబై మెట్రో రీజియన్ ప్రాంతంలోనూ 54.85 ఎకరాల భూములు రెసిడెన్షియల్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం కొనుగోలు చేశారు.
చెన్నైలో ఒక ఒప్పందంలో 5.5 ఎకరాల భూ బదిలీ జరిగింది. ఇది కూడా విభిన్న ప్రాజెక్టుల కోసం వినియోగించేందుకు ఉద్దేశించినది.
అహ్మదాబాద్, నాగ్ పూర్, సోనిపట్ సహా రెండో శ్రేణి, మూడో శ్రేణి నగరాల్లోనూ భారీ ఎత్తున భూముల క్రయ విక్రయాలు సాగాయని తెలిపింది.
రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం భూములు కొనుగోళ్లు జరిపిన వాటిలో రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థలు గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియాల్టీ, మహీంద్రా లైఫ్ స్పేసెస్, గౌర్స్ గ్రూప్, బిర్లా ఎస్టేట్స్, హెటెరో గ్రూప్, మైక్రోసాఫ్ట్, మాపుల్‌ట్రీ లాజిస్టిక్స్ తదితర సంస్థలు ఉన్నాయి.