భోజ్‌పురిని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి అధికార భాష హోదా కల్పించాలని పార్లమెంట్ ముందుకు బిల్లు వచ్చింది. భోజ్‌పురి సూపర్ స్టార్, బీజేపీ ఎంపీ రవికిషన్ ఈ మేరకు లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.
రాజ్యాంగ బిల్లు 2024ను శుక్రవారం ప్రవేశపెట్టిన రవి కిషన్ మాట్లాడుతూ భోజ్ పురి భాష అంటే బూటకపు పాటలకు సంబంధించినది కాదని, గొప్ప సాంస్కృతిక చరిత్ర, సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
“చాలా మంది భోజ్‌పురి భాషను మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు. అది మా మాతృభాష. ఈ భాషలో సినిమా పరిశ్రమ కూడా నడుస్తోంది. లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. అందుకే ఈ భాషను ప్రోత్సహించాలనుకున్నాను. సంగీత పరిశ్రమ కూడా చాలా పెద్దది,” అని ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కి చెందిన బీజేపీ ఎంపీ పీటీఐతో అన్నారు.
ఈ బిల్లు.. గొప్ప భోజ్‌పురి సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిందని ఆయన అన్నారు.
భాషను ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారన్నారు రవి కిషన్. “భాష అంటే బూతు పాటల గురించి కాదు. భాష చాలా గొప్పది, అందులో సాహిత్యం కూడా ఉంది,” అని కిషన్ అన్నారు.
భోజ్‌పురి సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నటుడు- పొలిటీషియన్ అన్నారు. “నేను నా కమ్యూనిటీకి తిరిగి ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఈ భాషే నా ఐడెంటిటీ,” అని రవి కిషన్ స్పష్టం చేశారు.
భారతదేశంలోని గంగా మైదానాలలో ఉద్భవించిన భోజ్‌పురి భాష అనేది చాలా పురాతన, గొప్ప భాష అని బిల్లులో ఉంది.
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు అనేక ఇతర దేశాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ప్రజలకు భోజ్‌పురి మాతృభాష అని బిల్లు పేర్కొంది.
మారిషస్ లో, ఈ భాషను పెద్ద సంఖ్యలో ప్రజలు మాట్లాడతారు. సుమారు 140 మిలియన్ల మంది భోజ్‌పురి మాట్లాడతారని అంచనాలు ఉన్నాయి.
భోజ్‌పురి చిత్రాలు దేశవిదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయని, హిందీ చిత్ర పరిశ్రమపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని బిల్లు పేర్కొంది. భరతేందు హరిశ్చంద్ర, మహావీర్ ప్రసాద్ ద్వివేది, మున్షీ ప్రేమ్ చంద్ వంటి హిందీ ప్రముఖ రచయితలు భోజ్‌పురి సాహిత్యంతో ప్రభావితులయ్యారని తెలిపింది.
భోజ్‌పురి నేపథ్యం ఉన్న అనేక మంది వ్యక్తులు దేశంలో అత్యున్నత పదవులు సాధించారని, భోజ్‌పురిని ప్రోత్సహించడానికి వివిధ అంతర్జాతీయ సదస్సులు కూడా జరిగాయని బిల్లు పేర్కొంది.
ప్రస్తుతం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ భోజ్‌పురి భాషలో సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించాలని యోచిస్తున్నట్టు బిల్లులో ఉంది. భోజ్‌పురి భాషను ప్రచారం చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఇటీవల బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భోజ్‌పురి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్లలో భోజ్‌పురి భాషకు సముచిత స్థానం కల్పించాలని ఉద్యమాలు ప్రారంభమయ్యాయని, అయితే రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో భోజ్‌పురి భాషకు ఇంకా చోటు దక్కకపోవడం దురదృష్టకరమని పేర్కొంది.
ప్రైవేట్ మెంబర్ బిల్లు అనేది మంత్రి కాని వ్యక్తిగత పార్లమెంటు సభ్యుడు ప్రారంభించే శాసన ప్రతిపాదన. ప్రైవేట్ మెంబర్ బిల్లుల ప్రాముఖ్యత ఏమిటంటే, అవి ప్రభుత్వ బిల్లులలో ప్రాతినిధ్యం వహించని సమస్యలపై శాసనసభ్యుల దృష్టిని ఆకర్షించడానికి లేదా శాసన జోక్యం అవసరమయ్యే ప్రస్తుత చట్టంలోని సమస్యలు, అంతరాలను ఎత్తిచూపడానికి వీలు కల్పిస్తాయి.
14 ప్రైవేటు మెంబర్ బిల్లులు మాత్రమే విజయవంతంగా చట్టరూపం దాల్చాయన్నది వాస్తవమే అయినా వాటి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేము.
సంబంధిత కథనం