తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రస్తుతం పంజాబ్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పంజాబ్ లోని హోషియార్ పూర్ లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీడియాలో కాసేపు మాట్లాడారు.
కాంగ్రెస్ లోకి సోదరుడు వరుణ్ గాంధీ పునరాగమనంపై వస్తున్న వార్తలపై కూడా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కజిన్ వరుణ్ గాంధీ (Varun Gandhi) ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని ఆమోదించాడని, ఆ సిద్ధాంతాన్ని స్వంతం చేసుకున్నాడని, అది తనకు ఆమోదనీయం కాదని స్పష్టం చేశాడు. ‘ఒకవేళ వరుణ్ (Varun Gandhi) కాంగ్రెస్ లోకి వస్తే తనే ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. సైద్ధాంతికంగా మా అభిప్రాయాలు కలవవు. వరుణ్ సొంతం చేసుకున్న సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేను’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేను. నేను ఎన్నటికీ ఆరెస్సెస్ (RSS) లోకి వెళ్లలేను. తలనైనా నరుక్కుంటా కానీ.. ఆ ఆఫీస్ మెట్లెక్కలేను. మా కుటుంబానికో సిద్ధాంతం ఉంది. ఒక ఆదర్శం ఉంది. వరుణ్ (Varun Gandhi) ఆరెస్సెస్ (RSS) సిద్ధాంతాల మార్గంలోకి వెళ్లాడు. అది నేను అంగీకరించలేను. ఒక సోదరుడిగా అతడిని కలుస్తాను, ఆలింగనం చేసుకుంటాను. కానీ సైద్ధాంతికంగా అతడిని సమర్ధించలేను’’ అని రాహుల్ గాంధీ వివరించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ (BJP) భారీగా దెబ్బతింటుందని రాహుల్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం మొదలైనవి బీజేపీ (BJP) ని భారీగా దెబ్బతీస్తాయన్నారు. ప్రజల్లో బీజేపీపై తీవ్రమైన ఆగ్రహం నెలకొని ఉన్నదన్నారు.
భారత దేశంలోని మీడియా (Media in India) తీరుపై కూడా రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మీడియా కూడా విద్వేషాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. తప్పులు జరగకుండా కాపాలా కాయాల్సిన బాధ్యతల్లో ఉన్న మీడియా ఆ బాధ్యతను గాలికొదిలి ప్రజల మధ్య విద్వేషాలను, విబేధాలను పెంచి పోషించే బాధ్యత చేపట్టిందని మండిపడ్డారు. ‘‘ఈ ప్రభుత్వ పాలనలో రైతులు దోచుకోబడుతున్నారు. చిన్న వ్యాపారులు కుదేలవుతున్నారు. వ్యవస్థలు నాశనమవుతున్నాయి. మీరు ఈ విషయాలను హై లైట్ చేయకుండా, హిందూ ముస్లిం విబేధాలు, బాలీవుడ్, గాసిప్స్, స్పోర్ట్స్ వంటి విషయాలపై దృష్టి పెడుతున్నారు’’ అన్నారు. మీడియా సహా ముఖ్యమైన వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాలకు మీడియా (Media in India) మంచి ఫీడ్ బ్యాక్ చానెల్ గా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘మీడియాను కొందరు నియంత్రిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు లక్ష్యంగా మీడియాపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో రిపోర్టర్ల తప్పు పెద్దగా ఏమీ లేదు. మీ ఒత్తిళ్లు మీకు ఉన్నాయి. మీ యజమాని ఏం చెబితే మీరు అదే చేయాల్సి ఉంటుంది. అందువల్ల నా విమర్శలు మీపై కాదు. మొత్తంగా మీడియా నిర్మాణంపైననే నా విమర్శలు’’ అని Congress నేత రాహుల్ గాంధీ విశ్లేషించారు.