నీతి(నేషనల్ ఇన్సిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫామింగ్ ఇండియా) ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా ప్రఖ్యాత ఆర్థిక వేత్త సుమన్ బెరీ నియమితులయ్యారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ రాజీనామా చేయడంతో ఈ నియామకం అనివార్యమయింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ దాదాపు ఐదేళ్లు పని చేశారు. అంతకుముందు వైస్ చైర్మన్‌గా పని చేసిన అరవింద్ పనగరియా స్థానంలో రాజీవ్ కుమార్ 2017 ఆగస్ట్‌లో ఈ బాధ్యతలు చేపట్టారు. నీతి ఆయోగ్‌ను ప్రణాళికా సంఘం(ప్లానింగ్ కమిషన్) స్థానంలో 2014లో ఏర్పాటు చేశారు. కొత్తగా వీసీగా నియమితుడైన సుమన్ బెరీ ఏప్రిల్ 30 వరకు నీతిఆయోగ్ ఫుల్ టైమ్ సభ్యుడిగా ఉంటారని, మే 1న ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ప్రకటించింది. నీతిఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని ఉంటారు.
ఆర్థికవేత్తగా సుమన్ బెరీకి గొప్ప అనుభవం ఉంది. ఇంతకు ముందు ఆయన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్(ఎన్‌సీఏఈఆర్)కి డైరెక్టర్ జనరల్‌గా దాదాపు పదేళ్లు(2001-2011) పని చేశారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో, స్టాటిస్టికల్ కమిషన్‌లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నికల్ కమిటీలో సభ్యుడిగా సేవలందించారు. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన సమయంలో సుమన్ ప్రపంచబ్యాంక్‌లో పని చేస్తూ ఉన్నారు. మాక్రో ఎకానమీ, ఫైనాన్షియల్ మార్కెట్స్, పబ్లిక్ డెట్.. తదితర రంగాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనమిక్స్, ఫిలాసఫీ సబ్జెక్టులుగా డిగ్రీ చేశారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ ఎఫైర్స్ పూర్తి చేశారు.