NEET aspirant suicide: కోటలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య; ఈ సంవత్సరం 17వ బలవన్మరణం
NEET aspirant suicide: రాజస్తాన్ లోని కోటలో నీట్, జేఈఈ శిక్షణ కోసం వచ్చిన విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం నీట్ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 17 మంది, గత మూడు నెలల్లో 11 మంది ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారు.
NEET aspirant suicide: రాజస్తాన్ లోని కోటలో నీట్, జేఈఈ శిక్షణ కోసం వచ్చిన విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం నీట్ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 17 మంది, గత మూడు నెలల్లో 11 మంది ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారు.
వారం క్రితమే వచ్చి..
వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్ష (NEET) కు శిక్షణ కోసం రాజస్తాన్ లోని జాలోర్ జిల్లా నుంచి వారం రోజుల క్రితమే ఈ విద్యార్థి కోటకు వచ్చాడు. 17 ఏళ్ల ఈ బాలుడు తన కజిన్ తో కలిసి కోటలోని జవహర్ నగర్ లోని ఒక హాస్టల్ లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి, తన కజిన్ మార్కెట్ కు వెళ్లిన సమయంలో తను ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ నిర్వాహకుల నుంచి సమాచారం రావడంతో, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద కానీ, రూమ్ లో కానీ ఎటువంటి సూయిసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
ఇష్టంగానే వచ్చాడు..
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు ఈ ఘటనతో షాక్ కు గురయ్యారు. నీట్ కోచింగ్ కోసం కోటకు వెళ్లాలని తాము బలవంతం చేయలేదని, తనకు తనే ఇష్టంగా కోచింగ్ కు వచ్చాడని వారు వివరించారు. వచ్చిన వారం లోపే ఇలా చనిపోవడం తమను షాక్ కు గురి చేసిందని వాపోతున్నారు. కోటలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలపై అధ్యయనం జరగాలని కోరారు. కాగా, ఈ ఆత్మహత్యల నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల నియంత్రణ కోసం ఒక బిల్లును రూపొందించింది.
ఈ సంవత్సరం 17 మంది..
కోటలో 2019 - 2022 మధ్య 52 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే 17 మంది ప్రాణాలు తీసుకున్నారు. గత మూడు నెలల్లో 11 మంది బలవన్మరణం పొందారు. శిక్షణ కేంద్రాల్లో పెట్టే పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో, ఒత్తిడికి లోనై ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.