Gang rape: ప్రభుత్వాసుపత్రిలో మరో ఘోరం; 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఒకవైపు, కోల్ కతాలో ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన దారుణ హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ప్రభుత్వాసుపత్రుల్లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. రాజస్తాన్ లోని ఒక ప్రభుత్వాసుపత్రిలో 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది.
Gang rape in Govt Hospital: జోధ్ పూర్ లోని ప్రభుత్వ మహాత్మాగాంధీ ఆసుపత్రి ఆవరణలోనే 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ప్రతాప్ నగర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ ఈ ఘటన పూర్వాపరాలను వివరించారు.
ఆసుపత్రి డంపింగ్ యార్డ్ వెనుక..
తల్లి మందలించడంతో ఆ 15 సంవత్సరాల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం సూరాసాగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఆవరణలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం, ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆస్పత్రి బయోమెడికల్ వేస్ట్ డంప్ యార్డు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి (gang rape) పాల్పడ్డారు.
కేసు నమోదు..
సోమవారం సాయంత్రం ఆస్పత్రి సమీపంలో బాధితురాలిని గుర్తించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం బాలిక తన తల్లిదండ్రులకు, పోలీసులకు దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దర్యాప్తు ప్రారంభించినట్లు కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆసుపత్రి ఆవరణలో నేరం జరిగిన ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించిందని, అనుమానితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని, వారి ఆచూకీ ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు.
హాస్పిటల్ మాజీ ఉద్యోగే నిందితుడు..
అనుమానితుల గురించి పోలీసులు తమకు అధికారికంగా సమాచారం ఇవ్వనప్పటికీ, అంతర్గత విచారణలో నిందితుల్లో ఒకరు గతంలో ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసినట్లు వెల్లడైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫతాసింగ్ భాటి తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతం చుట్టూ లైటింగ్ ను తనిఖీ చేయాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించామని, అదనపు లైట్లతో సహా భద్రతా చర్యలను పెంచుతున్నామని తెలిపారు.