Crime news : స్కూల్​కి వెళుతున్న బాలిక అపహరణ- ఎవరూ లేని చోటకు తీసుకెళ్లి గ్యాంగ్​ రేప్​!-rajasthan crime news minor abducted gang raped by three while going to school ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : స్కూల్​కి వెళుతున్న బాలిక అపహరణ- ఎవరూ లేని చోటకు తీసుకెళ్లి గ్యాంగ్​ రేప్​!

Crime news : స్కూల్​కి వెళుతున్న బాలిక అపహరణ- ఎవరూ లేని చోటకు తీసుకెళ్లి గ్యాంగ్​ రేప్​!

Sharath Chitturi HT Telugu
Jan 17, 2025 10:11 AM IST

రాజస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్​కి వెళుతున్న బాలికపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

స్కూల్​కి వెళుతున్న బాలిక అపహరణ.. ఆ తర్వాత!
స్కూల్​కి వెళుతున్న బాలిక అపహరణ.. ఆ తర్వాత!

రాజస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్​కి వెళుతున్న ఓ బాలికను అపహరించిన కొందరు, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

రాజస్థాన్​లోని ఫలోడీలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక తన నివాసానికి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు బయలుదేరింది. ఆమె కోసం కారులో వేచి ఉన్న ముగ్గురు నిందితులు, బాలికను అపహరించి ఆ ప్రాంతానికి ఐదారు కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ రోజు బాలిక పాఠశాలకు రాలేదని ఉదయం 11.30 గంటల సమయంలో పాఠశాల యాజమాన్యం ఆమె తండ్రికి సమాచారం ఇవ్వడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె ఆచూకీ కోసం వెతికినా ఫలితం దక్కకపోవడంతో బాలిక తండ్రి లోహావత్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. కాగా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఒక బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించాడు. అది తన కుమార్తె అని తెలిసి షాక్​కి గురయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు.

బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు వ్యక్తులు తనపై గంటకుపైగా వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారని, వారిలో ఒకరు చుట్టుపక్కల నిఘా పెట్టారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తన తండ్రి కనిపించడం లేదని ఎవరో.. నిందితులకు చెప్పారని, ఆ తర్వాత వారు ఆమెను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారని సింగ్ తెలిపారు.

ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 63 (అత్యాచారం), 70 (సామూహిక అత్యాచారం), 138 (అపహరణ), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

నిందితుల్లో ఇద్దరు గతంలో స్థానిక రైతు అయిన బాలిక తండ్రితో కలిసి నెల రోజుల పాటు పనిచేసినట్లు విచారణలో తేలింది.

పోలీసుల చర్య నుంచి తప్పించుకునేందుకు నిందితులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు. నిందితుల్లో ఒకరు మరో జిల్లాకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా బలోత్రాలోని చెక్​పోస్ట్​ వద్ద పోలీసు బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. మిగతా ఇద్దరు అనుమానితుల కోసం గాలింపు కొనసాగుతోందని సింగ్ తెలిపారు.

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పోలీసులు గురువారం ఉదయం బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

బాధితురాలిపై లైంగిక వేధింపులు గణనీయంగా జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. “అపహరణను ధృవీకరించడానికి మేము ఆ ప్రాంతంలోని సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నాము. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది,” అని సింగ్ తెలిపారు.

సామూహిక అత్యాచారంపై రాజకీయ దుమారం..

మరోవైపు 13ఏళ్ల బాలిక అపరహరణ, సామూహిక అత్యాచారం ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా.. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “బీజేపీ అసమర్థ ప్రభుత్వం. బలహీనమైన శాంతిభద్రతల ఫలితం ఏమిటంటే, ఈ రోజు మా కుమార్తెలు వారి గ్రామాలు, గృహాలు, పాఠశాలలలో కూడా సురక్షితంగా లేరు! మహిళల భద్రతకు హామీ ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ గత ఏడాది కాలంలో మైనర్ బాలికలపై నేరాలు, క్రూరత్వ ఘటనలు రికార్డు స్థాయిలో పెరిగాయి,” అని అన్నారు.

2024లో 1,610 మంది మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగాయని, ఇది 2023తో పోలిస్తే 3.34 శాతం అధికమని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2022తో పోలిస్తే 10.2 శాతం ఎక్కువని గోవింద్​ సింగ్​ చెప్పారు. "రోజూ అమాయక బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు బీజేపీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఈ చిత్రం బీజేపీ 'నహీ సహేగా రాజస్థాన్' నినాదం వాస్తవికతను కూడా బహిర్గతం చేస్తోంది," అని ఆయన ఎక్స్​లో రాశారు.

బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ భరద్వాజ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏ నేరస్థుడిని వదిలిపెట్టదని, ఈ కేసులో నిందితులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. గత ఏడాది రాజస్థాన్​లో మొత్తం నేరాల రేటు గణనీయంగా తగ్గిందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.