Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు-rajasthan 15 hindustan copper ltd officials trapped in mines 3 rescued after 12 hrs ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

HT Telugu Desk HT Telugu
May 15, 2024 12:06 PM IST

రాజస్తాన్ లోని ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కు చెందిన గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ కుప్పకూలడంతో 15 మంది గనిలో చిక్కుకుపోయారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని 12 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి, ఇప్పటివరకు ముగ్గురు అధికారులను కాపాడగలిగింది.

రాజస్తాన్ లోని హెచ్ సీ ఎల్ గనిలో ప్రమాదం
రాజస్తాన్ లోని హెచ్ సీ ఎల్ గనిలో ప్రమాదం

రాజస్థాన్లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని కోలిహాన్ గనిలో మంగళవారం రాత్రి లిఫ్ట్ కూలిపోవడంతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సీఎల్)కు చెందిన 15 మంది అధికారుల బృందం చిక్కుకుంది. ముగ్గురిని రక్షించగా, మిగిలిన 12 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రక్షించిన ముగ్గురిని ఏకే శర్మ, హన్స్ రామ్, ప్రీతమ్ సింగ్ గా గుర్తించారు. మిగిలిన 12 మందిని ఉపేంద్ర పాండే, బనేందు భండారీ, నిరంజన్ సాహూ, జీడీ గుప్తా, రమేశ్ నారాయణ్ సింగ్, వినోద్ సింగ్ షెకావత్, ఏకే బైరా, అర్నవ్ భాబ్దారీ, యశ్రాజ్ మీనా, వికాస్ పరీక్, కరణ్ గెహ్లాట్, భగీరథ్ గా గుర్తించారు.

విజిలెన్స్ తనిఖీల కోసం..

‘‘కోల్ కతా నుంచి వచ్చిన విజిలెన్స్ బృందం తనిఖీ కోసం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కు చెందిన కోలిహాన్ గనిలోకి వెళ్లింది. రాత్రి 8 గంటల సమయంలో లిఫ్ట్ ద్వారా పైకి వస్తుండగా ఈ ప్రమాదం జరగింది. అయితే, లిఫ్ట్ కు సంబంధించిన ఒక గొలుసు మాత్రమే తెగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాదాపు 700 మీటర్ల లోతులో మొత్తం 15 మంది చిక్కుకున్నారు’’ అని స్థానిక ఖేత్రి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ భన్వర్ లాల్ తెలిపారు.

వెంటనే సహాయ చర్యలు

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని 12 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టింది. రక్షించిన ముగ్గురిని చికిత్స నిమిత్తం జైపూర్ కు తరలించినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు. ‘బాధితులకు అత్యవసర మందులు, ఆహారాన్ని రెస్క్యూ టీం సరఫరా చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చిక్కుకున్నమిగతా వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం లిఫ్ట్ ను మాన్యువల్ గా తరలించేందుకు ప్రయత్నిస్తోంది' అని భన్వర్ లాల్ తెలిపారు.

ఎమ్మెల్యే స్పందన

ప్రమాద సమాచారం తెలియగానే ఘటనాస్థలానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ధరంపాల్ గుర్జార్ చేరుకుని, సహాయ చర్యలను పర్యవేక్షించారు. తాను ఎన్నికల ప్రచారం కోసం హరియాణా వెళ్లానని, అయితే ఈ సమాచారం తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చానని చెప్పారు. ‘రెస్క్యూ టీం సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంది, మరియు 6-7 అంబులెన్స్లు ఇక్కడ సిద్దంగా ఉన్నాయి. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కచ్చితంగా అందరూ సురక్షితంగా బయటకు వస్తారు’ అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత లోతైనదిగా భావించే కొలిహాన్ ప్రాంతంలో 1972లో హెచ్ సీఎల్ గనులను ప్రారంభించింది. సోమవారం నుంచి ఆ ప్రాంతంలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి.

IPL_Entry_Point

టాపిక్